వసతులు పెంచాలి
ప్రతిపాదనలు పంపాం
● బెలుం గుహలపై సర్కారు నిర్లక్ష్యం ● ఏటా కోటికి పైగా ఆదాయం.. కనిపించని సౌకర్యాలు ● ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు
కొలిమిగుండ్ల: ప్రపంచంలో రెండో అతిపెద్ద గుహలుగా బెలుం గుహలకు పేరు. భూమి అంతర్భాగంలో 3,229 మీటర్ల మేర విస్తరించి దేశ,విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ గుహలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోంది. సౌకర్యాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 8,9 తేదీల్లో అట్టహాసంగా బెలుం గుహల ఉత్సవాలను మొట్టమొదటి సారిగా నిర్వహించారు. పెద్ద ఎత్తున సాంసృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు ఉత్సవాల నిర్వహణ, సౌకర్యాల కల్పన ఊసేత్తడం లేదు.
ఆదాయం ఫుల్...
సౌకర్యాలు మాత్రం అంతంతే
గుహలను వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షకు పైగా మంది పర్యటకులు వస్తుంటారు. జిల్లాలో శ్రీశైలం తర్వాత పర్యాటక శాఖకు అత్యధిక ఆదాయం అందించేది బెలుం గుహలే. 2025–26 వార్షిక సంవత్సరంలో రూ.1.10 కోట్ల ఆదాయం సమకూరింది. సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు తదితర ఖర్చులు పోను రూ.40 లక్షల మేర ఆదాయం మిగిలింది. పర్యాటకుల తాకిడి పెరగడంతో ఇటీవలనే గుహల సందర్శన టికెట్ల ధరలను సైతం పెంచారు. పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.70 వసూలు చేస్తున్నారు. ధర ఎంతైనా బెలుం గుహల అందాలను తిలకించాలని చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే, వారు గుహల వద్ద సరైన వసతులు లభించక ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2017లో కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంతో గుహ లోపలి భాగాలు అస్తవ్యస్తంగా మారాయి. అప్పట్లో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, స్పీకర్లు, లైటింగ్ వ్యవస్థ, బ్రోయర్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో సిమెంట్ బెడ్‌లు, బండ పరుపులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బ్రోయర్లు సరిగా పని చేయక ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రదేశాల్లో లైటింగ్ లేక అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తుందని యాత్రికులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే లోపల బురద మయంగా మారుతోంది. కోటిలింగాలు తదితర ముఖ్యమైన ప్రదేశాలను చూసేందుకు అవకాశం లేకుండా పోతుంది. వీటిపై దృష్టిసారించడంతో పాటు గుహల లోపల అధునాతన లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
డార్మెటరే దిక్కు
ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గుహల ఆవరణలో వసతి సౌకర్యం కరువైంది. మొదట్లో నిర్మించిన డార్మెటరీ మాత్రమే దిక్కు. ఇందులో ఫ్యామిలీతో వచ్చే యాత్రికులకు అనుగుణంగా వసతులు లేవు. దీంతో తాడిపత్రి చుట్టు పక్కల పట్టణాల్లో బస చేసి ఇక్కడికి రావాల్సి వస్తుంది. గుహల ఆవరణలో విశాలమైన మైదానం ఉంది. ఓర్వకల్లు సమీపంలోని రాక్‌గార్డెన్ తరహాలో అన్ని వసతులతో గదుల నిర్మాణం, పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ తదితరవి ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
పని చేయని స్పీకర్
కుటుంబ సభ్యులతో కలిసి గుహలను తిలకించేందుకు కారులో వచ్చాం. గుహలోపల చూడదగ్గ ప్రదేశాలు బాగున్నాయి. కానీ వసతులు మాత్రం సరిగా లేవు. గాలి వచ్చేందుకు మరిన్ని బ్రోయర్లు పెట్టాలి. లైటింగ్ పెంచాలి. చీకటిగా ఉండటం వల్ల కింద పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే యాత్రికులతో పాటు గైడ్‌లను పంపిస్తే బాగుంటుంది. – అరుణ్‌కుమార్, పర్యాటకుడు, కడప
గుహల అభివృద్ధి కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. లోపల లైటింగ్, సీసీ కెమెరాలు, స్పీకర్లు, అదనపు బ్రోయర్లు నిర్మించాలని కోరాం. పర్యాటకుల సౌకర్యం కోసం పది గదులు నిర్మించేందుకు నివేదికలు పంపాం. గుహలకు ఏటా కోటి రూపాయలకు పైగానే ఆదాయం వస్తుంది.
– కిషోర్, గుహల యూనిట్ మేనేజర్


