నంద్యాల(అర్బన్): విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వాములను చేసినప్పుడే మేలైన విత్తనం లభిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం ఖరీఫ్ విత్తన దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ జాన్సన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంటకు సరిపడ మోతాదులో రైతులు విత్తనాలను వినియోగించాలని, ఎరువులు, గుళికలు సరైన సమయంలో వేస్తే దిగుబడులు సాధించవచ్చన్నారు. నాణ్యమైన విత్తనం, ఉత్తమ యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. మెట్ట వరి, ఆరు తడి పంటల వల్ల నీటి వినియోగం తగ్గించుకోవచ్చని, పాడి పంటలను సమన్వయంగా ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యంతో పాటు మానవాళి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందన్నారు. సీనియర్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ విత్తన ఎంపిలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన వంగడాలు, ఆధునిక సాంకేతికతను పాటిస్తూ అధిక ఆదాయం పొందాలన్నారు. ఏపీసీఎన్‌ఎఫ్ డీపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారానే నాణ్యమైన పంటలను పండించవచ్చన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షలు, ఎరువుల మోతాదు గురించి భూసార శాస్త్రవేత్తలు కవిత, ఫరీదా, జయలక్ష్మిలు వివరించి రైతులకు భూసార పరీక్ష పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌సీ ఏడీఏ చెన్నయ్య, ఎన్‌ఎస్‌సీ ఏరియా మేనేజర్ మోహన్‌రాజు, శ్రీసాయి, ఆర్‌ఈఏసీ మెంబర్ మద్దిలేటి, శాస్త్రవేత్తలు అశోక్‌కుమార్, వెంకటరమణ పాల్గొన్నారు.


