అభివృద్ధి, సంక్షేమం శూన్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం శూన్యం

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

బేతంచెర్ల: సీఎం చంద్రబాబు రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం బేతంచెర్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పాతబస్టాండు సమీపంలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను చించి నిరసన తెలిపారు. అక్కడ నుంచి నగర పంచాయతీ కార్యాలయం చేరుకొని పట్టణంలోని తాగునీటి, ఇతర సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌ హరిప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి బుగ్గన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి

రేండేళ్లు పూర్తవుతున్నా మహిళలకు ఆడబిడ్డ నిధి, యువకులకు నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందలేదన్నారు. అర్హులందరికీ కొత్త పింఛన్ల హామీని అమలు చేయకుండా చరిత్ర సృష్టించిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.

ప్రజలపై భారం

హామీలను గాలికి వదిలేసి, పెట్రోలు, డీజల్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై భారం మోపారని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని.. ఇంతకంటే ఘోరమైన పాలనను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.

అంతా అంధకారమే!

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ, ఎంఎస్‌ఎంఈ భవనాలకు నేటికీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వలేదని మాజీ మంత్రి బుగ్గన మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అంతా అంధకారమే కనిపిస్తోందని విమర్శించారు. బీసీ రెసిడెన్సియల్‌ స్కూల్‌, కళాశాలలో విద్యార్థులకు కూర్చోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి రూ. 351 కోట్లతో చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ పథకం పనులు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. బేతంచెర్ల పట్టణానికి పది రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతంచెర్ల పట్టణానికి రూ. 44 కోట్లతో మంజూరైన అమృత 2.0 పథకం టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.

దేవుడు కూడా క్షమించరు!

శ్రీ మద్దిలేటి నరసింహస్వామి, ముచ్చట్ల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు నిలిపివేశారని, టీడీపీ నేతలను దేవుడు కూడా క్షమించబోరని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. పాలుట్ల రంగస్వామి ఆలయ రహదారి పనులు ఎందుకు నిలిచిపోయాయో టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో కొత్త అభివృద్ధి పనులు చేపట్టకపోగా కనీసం రహదారులు గుంతలు కూడా పూడ్చలేని దుస్థితి నెలకొందన్నారు.

‘వాటర్‌ గ్రిడ్‌’ ప్లాంట్‌ వరకు పాదయాత్ర

బేతంచెర్ల పట్టణం నుంచి బుగ్గానిపల్లె మీదుగా బుగ్గానిపల్లె తండా సమీపంలో ఉన్న వాటర్‌ గ్రిడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బుగ్గన పాదయాత్ర నిర్వహించారు. అక్కడ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్‌ను సందర్శించి, నీటి శుద్ధి ప్రక్రియ, సరఫరాపై సిబ్బందితో చర్చించారు. పాదయాత్రలో బేతంచెర్ల పట్టణవాసులతో పాటు బుగ్గానిపల్లె, బుగ్గానిపల్లె తండా వాసులు పాల్గొన్నారు. నగర పంచాయతీ చైర్మన్‌ చలం రెడ్డి, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, డోన్‌ ఎంపీపీ రాజ శేఖర్‌ రెడ్డి, మాజీ మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు, నాయకులు మెట్టు వెంకటేశ్వర్‌రెడ్డి, మూర్తుజావలి, బాబురెడ్డి, ఖాజాహుసేన్‌, రామచంద్రుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement