● జిల్లా పరిషత్ చైర్మన్
ఎర్రబోతుల పాపిరెడ్డి
కొలిమిగుండ్ల: సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామిలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి విమర్శించారు. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమంలో భాగంగా గురువారం కొలిమిగుండ్ల పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నాయకులతో కలిసి కరపత్రాలతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడే టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్‌తో పాటు 143 రకాల హామీలు ఇచ్చారన్నారు. సూపర్ సిక్స్‌లో అమలవుతున్న ఒకటి, రెండు పథకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆరోపించారు. మహిళలకు ఫ్రీబస్సు ఏర్పాటు చేసి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయక పోవడంతో రద్దీ కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతులను పూర్తిగా దగా చేశారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోగా వైఎస్సార్‌సీపీని మరింతగా బలోపేతం చేసుకుందామని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పేరం నందకిషోర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి, గుర్విరెడ్డి, రామసుబ్బయ్య, రామనాథరెడ్డి, బాచం మహేశ్వరరెడ్డి, పేరం రాంశంకర్‌రెడ్డి, కంబయ్య, తోట శివశంకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుబ్బయ్య, కామిని గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


