ఇలా చేద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ఇలా చేద్దాం..

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

● ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్‌ వినియోగం అధికమైంది. ఇప్పటికే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. రీసైక్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

● ప్రస్తుతం కర్నూలు జిల్లాలో వాయు కాలుష్యమే అధికం. కర్నూలు జిల్లాలో 42 లక్షల జనాభా ఉంది. ఇందులో 70 శాతం జనాభా వాహనాలను వినియోగిస్తోంది. ఈ సంఖ్య ఏటా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని నివారణకు ప్రజలకు వీలైనంత వరకు వాహనాల వినియోగాన్ని తగ్గించాలి. ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ విద్యుత్‌ను వినియోగించాలి.

● కర్నూలుతోపాటు ఇతర పట్టణాల్లో దాదాపు లక్ష వరకు ఆటోలు ఉన్నాయి. వీటిలో కాలం తీరిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటోలు చేసే ధ్వని శబ్ధాలు 140 డెసిబుల్స్‌ వరకు ఉండడంతో శబ్ధకాలుష్యం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి సిటీ బస్సులను ప్రవేశపెడితే కాలుష్య నియంత్రణకు ఒక పరిష్కారం లభిస్తుంది.

● కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీతో పాటు నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారబోసి నిప్పు బెడుతున్నారు. కల్లూరు ఎస్టేట్‌లోని పారిశ్రామిక వాడలో పరిశ్రమల కోసం వినియోగించిన వ్యర్థ ప్లాస్టిక్‌ను రోడ్లపైనే కాల్చి వేస్తున్నారు. గార్గేయపురంలోని డంప్‌యార్డులో చెత్తకు నిప్పు పెడుతున్నారు. ఈ విషయంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.

● హంద్రీ, తుంగభద్ర, కుందూ నదిలో మురుగు నీరు కలుస్తున్నా అధికారుల చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. నదులు, వాగులు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

కాలుష్య కారకాల నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం, అధికారుల సమన్వయం ముఖ్యం. కాలుష్య నియంత్రణ మండలితో పాటు పోలీసు, రవాణాశాఖ, మునిసిపల్‌, పంచాయతీ అధికారుల బాధ్యత ఉంటుంది. ఎవరి విధులు వారు పాటిస్తే కాలుష్య నియంత్రణానికి మేలు చేసిన వారవుతారు.

పర్యావరణ సంరక్షణ బాధ్యతలో మొక్కల పెంపకం అతి ముఖ్యమైనది. మొక్కల పెంపకంపై ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఎవరైతే మొక్కను నాటుతారో వారే సంరక్షణ బాధ్యతను తీసుకుంటే మొక్కలు చెట్లవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement