ఎస్‌ఐఆర్‌లో కృత్రిమ మేధస్సును అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌లో కృత్రిమ మేధస్సును అమలు చేయాలి

Jun 5 2026 4:35 AM | Updated on Jun 5 2026 4:35 AM

ఆల్‌ ఇండియా ముస్లిం మైనారిటీస్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

కర్నూలు(అర్బన్‌): స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో కృత్రిమ మేధస్సును అమలు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక ఉర్దూఘర్‌ షాదీఖానాలో ఆల్‌ ఇండియా ముస్లిం మైనారిటీస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సయ్యద్‌ మహ్మూద్‌ పీర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మైనారిటీ శాఖకు చెందిన కేయూపీఎస్‌ ట్రైనింగ్‌ అకాడమీ కోఆర్డినేటర్‌ సయ్యద్‌ ఏజాజ్‌ అహ్మద్‌, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఏపీ ముతవల్లీల సంఘం అధ్యక్షులు షకీల్‌షఫీ, ఐఎంసీ టీం వ్యవస్థాపకులు రహ్మత్‌పాషా, సామాజిక కార్యకర్త జమీల్‌ అహ్మద్‌, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేర్లు కొనసాగేందుకు ప్రతి ఓటరు తమ వివరాలను ధ్రువీకరించుకోవాలన్నారు. ఏఐ ఆధారిత వ్యవస్థల ద్వారా అర్హులైన ఓటర్లను సులభంగా గుర్తించడం, పొరపాట్లను తగ్గించడం జరుగుతుందన్నారు. అలాగే దరఖాస్తుల స్థితిగతులు, అవసరమైన చర్యల గురించి ఓటర్లకు ఆటోమేటిక్‌గా ఎస్‌ఎంఎస్‌లు, డిజిటల్‌ నోటిఫికేషన్లను పంపించడం సాధ్యమవుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటరు ధ్రువీకరణ మరింత పారదర్శకంగా సమర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా మారుతుందన్నారు. కౌన్సిల్‌ చైర్మన్‌ సయ్యద్‌ మహ్మూద్‌ పీర్‌ మాట్లాడుతూ.. ఓటరు చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమాచారం లేమి కారణంగా ఒక్క నిజమైన ఓటు కూడా కోల్పోకూడదన్నారు. అర్హత కలిగిన పౌరులందరూ ఓటరు జాబితాలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉలేమా, పలు సామాజిక సంస్థల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement