నంద్యాల(అర్బన్): చిల్లర పనులు, బెదిరింపులకు భయపడేదే లేదని వైఎస్సార్‌సీపీ శ్రీశైలం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ మూకలు దాడి చేయడంపై శిల్పా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని శిల్పా స్వగృహంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. తనను, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడి దాడులకు ఉసిగొల్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై జిల్లా కలెక్టర్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిక్కతిక్క చేష్టలు చేస్తే భయపడేది లేదన్నారు. బుడ్డా ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకుండా ‘నీ కథ చూస్తా’మంటూ బెదిరించే విధంగా మాట్లాడతారని, ఆయన బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరన్నారు. తాను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో పదవులు చేశానని, ప్రజలకు సేవ ఎలా చేయాలో తనకు తెలుసు అన్నారు. సున్నిపెంటలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వచ్చిన జనాలను చూసి ఓర్వలేక బుడ్డా ఇష్టారీతిగా దూషించడం మొదలు పెట్టారన్నారు. వైఎస్సార్‌సీపీలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భయపడి నాలుగున్నరేళ్లు నియోజకవర్గం వదిలి వెళ్లిన బుడ్డాకు ఈ రోజు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పార్టీ కార్యాలయంపై రాళ్లు వేయిస్తే భయపడతామనుకోవద్దన్నారు.
చిల్లర రాజకీయాలు చేయం..
ఆత్మకూరులో జరిగిన సంఘటనపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో సంయమనంతో ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ సమక్షంలోనే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అసభ్య పదజాలం మాట్లాడటం దారుణమన్నారు. శిల్పా కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ తగ్గేది లేదన్నారు. శిల్పా కుటుంబానికి ప్రజలకు సేవ చేయడమే తెలుసు కానీ, చిల్లర రాజకీయాలు చేయడం తెలియదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెడుతున్నా ప్రజా తీర్పును గౌరవించి సహనంతో ఎదుర్కొంటున్నామన్నారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని కూటమి కార్యకర్త ధ్వంసం చేసి ఆ సంఘటనను ప్రజల్లోకి వెళుతుంటే జీర్ణించుకోలేక టాపిక్ డైవర్ట్ చేయడానికి టీడీపీ నాయకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి ప్రజలకు ఏవిధమైన మెసేజ్ ఇవ్వాలనుకున్నారో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, వైఎస్సార్‌సీపీ వ్యవసాయ విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకున్న పోలీసులు..
ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేశారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల పట్టణంలోని శిల్పా చక్రపాణిరెడ్డి స్వగృహానికి చేరుకున్నారు. సంఘటనను తెలుసుకున్న శిల్పాచక్రపాణిరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డిలు ఆత్మకూరుకు కార్యకర్తలతో కలిసి వెళ్లడానికి బయల్దేరే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు శిల్పా స్వగృహానికి రాత్రి 8 గంటల సమయానికి దాదాపు 1000 మందికిపైగా చేరుకున్నారు. నంద్యాల పోలీసులు శిల్పా స్వగృహానికి చేరుకొని ఆత్మకూరుకు వెళ్లడానికి వీల్లేదని అడ్డుకున్నారు. చివరకు నంద్యాలలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వెళ్తామన్నా పోలీసులు అనుమతించ లేదు.
సున్నిపెంట అఖిలపక్ష సమావేశానికి
జనాదరణ ఓర్వలేకనే దాడులు
బుడ్డాపై సుమోటో కేసు
నమోదు చేయాలి
మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి


