శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.5 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయానికి రూ.5 లక్షల విరాళం

Jun 4 2026 5:16 AM | Updated on Jun 4 2026 5:16 AM

బనగానపల్లె రూరల్‌: నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయ అభివృద్ధికి విజయవాడ పట్టణానికి చెందిన న్యూ ఎలక్ట్రిసీటి కాలనీ పటమటకు చెందిన శీలందేవి వివేకానంద, పద్మజ కుటుంబ సభ్యులు రూ.5.05 లక్షల విరాళాన్ని అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. విరాళం మొత్తంలో రూ. 4,50,005 ఆలయ అభివృద్ధికి, మరో రూ.50 వేలు అన్నదానానికి అందజేశారన్నారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులను సన్మానించి, అమ్మవారి ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

మహానంది: ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవుని మనుగడ కష్టమవుతుందని అటవీశాఖ నంద్యాల ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ అన్నారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా బుధవారం సీడ్‌ బాల్స్‌ డిస్పర్సల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. డీఆర్‌ఓ హైమావతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రతలను తగ్గించాలంటే చెట్లను పెంచడమే ఏకై క మార్గమన్నారు. అందులో భాగంగానే సీడ్‌ బాల్స్‌ తయారు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు రామకృష్ణ, తేజ, ఎఫ్‌బీఓలు పరమేశ్వరీ, బలరాముడు పాల్గొన్నారు.

నవచేతన యాప్‌తో చిన్నారుల్లో లోపాల గుర్తింపు

నంద్యాల(అర్బన్‌): నవ చేతన యాప్‌తో చిన్నారుల్లో లోపాలను గుర్తించవచ్చని జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి లీలావతి దేవి తెలిపారు. చిన్నారుల సమగ్రాభివృద్ధి, ఆరోగ్య స్థితిని మరింత సమర్థవంతంగా అంచనా వేసేందుకు నవచేతన ఏఐ యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. స్థానిక కార్యాలయంలో బుధవారం యాప్‌పై సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు రెండవ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పీడీ మాట్లాడుతూ.. 0–6 వయస్సు గల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పోషకాహార స్థితి, అభివృద్ధి మైలు రాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ యాప్‌ ముఖ్య ఉద్దేశమన్నారు. మూడు పద్ధతుల్లో స్క్రీనింగ్‌ చేసి 21 రకాల లోపాలను గుర్తించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే నోడల్‌ ఆఫీసర్‌ కాంతరావునాయక్‌, డాక్టర్లు మహమ్మద్‌ అలియాస్‌ పాల్గొన్నారు.

జీవో 207ను రద్దు చేయాలి

చాగలమర్రి: నూనెపల్లి మార్కెట్‌యార్డు పరిధిలోని సుమారు రెండెకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి లీజుకు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 207ను వెంటనే రద్దు చేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. రైతుల అవసరార్థం కేటాయించిన భూములను ఏడాదికి రూ.1000 చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన నంద్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఆయన చాగలమర్రిలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు మార్కెట్‌ యార్డు భూములను రైతుల అవసరాలకు, గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ సంబంధిత సౌకర్యాలకు మాత్రమే కేటాయించాలన్నారు. ఆయన వెంట కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు పాములేటి, మాజీ సర్పంచ్‌ నారాయణ, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement