అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

Jun 4 2026 5:16 AM | Updated on Jun 4 2026 5:16 AM

బొమ్మలసత్రం: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ ముఠా నుంచి భారీ నగదు, కారు, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ నంద్యాలలోని తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. డోన్‌ పట్టణంలో ఏప్రిల్‌ 20వ తేదీ తెల్లవారుజామున ఐటీసీ సిగరెట్‌ గోడౌన్‌లో భారీ చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు డోన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డోన్‌, సీసీఎస్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా అత్యాధునిక సీసీ కెమెరాల ద్వారా దొంగల కదలికలపై నిఘా ఉంచారు. డోన్‌ –గుత్తి జాతీయ రహదారిలోని రుద్రాక్షగుట్ట వద్ద అనుమానంతో మారుతి స్విఫ్ట్‌ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో రాజస్థాన్‌కు చెందిన లక్ష్మణ్‌రామ్‌ కుమావత్‌, గన్‌ శ్యామ్‌ అలియాస్‌ గణ్‌పత్‌, మానక్‌ చంద్‌ కుమావత్‌లున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఐటీసీ సిగరెట్‌ గోడౌన్‌లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. సిగరెట్‌ కార్టన్‌లను హైదరాబాద్‌లో విక్రయించినట్లు తెలిపారు. దీంతో పై నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 14 లక్షల నగదు, కారు, 45 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన ఈ ముగ్గురు దొంగలపై తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పదుల సంఖ్యలో చోరీ కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. చోరీ కేసును ఛేదించిన డోన్‌ సీఐ ఇంతియాజ్‌ బాషా, సీసీఎస్‌ సీఐ సురేష్‌కుమార్‌, ఎస్‌ఐలు శరత్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్‌, సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

రూ.14 లక్షల నగదు, కారు,

నాటుసారా స్వాధీనం

ఏప్రిల్‌నెలలో డోన్‌ పట్టణం

ఐటీసీ గోడౌన్‌ చోరీ

రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు

దొంగలు అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement