70 ఏళ్ల తర్వాత.. | - | Sakshi
Sakshi News home page

70 ఏళ్ల తర్వాత..

Jun 4 2026 5:16 AM | Updated on Jun 4 2026 5:16 AM

తమ్మడపల్లెలో ఘనంగా పెద్దమ్మ దేవర

మహానంది: పది కాదు, ఇరవై కాదు.. ఏకంగా 70 ఏళ్ల తర్వాత తమ్మడపల్లె గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవరను వైభవంగా నిర్వహించారు. గ్రామంలో కొలువుదీరిన పెద్దమ్మ తల్లిని బుధవారం వేలాది మంది దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. 1956 తర్వాత గ్రామంలో దేవర జరగక పోవడంతో గ్రామస్తులందరూ చర్చించుకుని దేవరను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన కోలాటం, చెక్కభజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు పెద్దమ్మ తల్లీ.. ఆశీర్వదించవమ్మా.. అంటూ ప్రణమిల్లారు. వేలాది మంది బంధుమిత్రులు తరలిరావడంతో తమ్మడపల్లె గ్రామం కిటకిటలాడింది. రెండు రోజుల్లో గ్రామం మొత్తం మీద సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చైనట్లు ప్రాథమిక సమాచారం. ఇంటింటికీ పిలుచుకున్న బంధుమిత్రులతో పండగ వాతావరణం నెలకొంది. తిరుగుప్రయాణంతో నంద్యాల – మహానంది రహదారిలో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. వాహనం ముందుకు కదలాలంటే కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధ్దీకరించి ఇబ్బందులు లేకుండా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement