అర్జీదారులతో నేరుగా.. | - | Sakshi
Sakshi News home page

అర్జీదారులతో నేరుగా..

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

న్యూస్‌రీల్‌

నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కార సంతృప్తి స్థాయిని స్వయంగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌ నుంచి నలుగురు అర్జీదారులు టెలిఫోన్‌ ద్వారా ప్రత్యక్షంగా మాట్లాడారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకత, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రత్యేక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ ఆక్రమణలు, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ నమోదు లోపాలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ పెన్షన్‌, వాగు పోరంబోకు భూముల ఆక్రమణ తదితర అంశాలపై అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని అర్జీదారుల నుంచే నేరుగా తెలుసుకున్నారు. భూ ఆక్రమణ ఫిర్యాదుకు సంబంధించి డిప్యూటీఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ద్వారా స్థల సర్వే నిర్వహించి హద్దులు, కొలతలు చూపించడంతో సమస్య పరిష్కారమైందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ పెన్షన్‌ అంశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత లేకపోవడంతో పెన్షన్‌ మంజూరు సాధ్యం కాదని అధికారులు స్పష్టంగా వివరించినట్లు అర్జీదారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందుతున్న ప్రతి ఫిర్యాదును నిర్దేశిత కాలపరిమితిలో నాణ్యమైన పరిష్కారంతో ముగించాలన్నారు.

పంటల సాగు ఆధారంగా ఎరువుల పంపిణీ

నంద్యాల(అర్బన్‌): ఖరీఫ్‌ సీజన్‌ 2025 పంట కాలంలో నమోదు చేసిన పంటల ఆధారంగా ఎరువుల పంపిణీ జరుగుతుందని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సంబంధిత సేవా కేంద్రానికి వెళ్లి సిబ్బందిని సంప్రదించి వారి వివరాలు ఏపీఏఐఎంఎస్‌ యాప్‌లో పొందు పరుచుకొని ఎరువులను పొందవచ్చన్నారు. ప్రైవేటు డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు పొందాలంటే రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా ప్రైవేటు డీలర్ల వివరాలు పొందు పరిస్తే ఎరువులు పొందవచ్చని సూచించారు. ఎకరాకు కనీసం మూడు బస్తాల చొప్పున ఎరువుల విక్రయాలు ఉంటాయని, దఫాల వారీగా మూడు విడతల పద్ధతి ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement