● మా స్థలాన్ని టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు ● పురుగు మందు, పెట్రోల్‌తో ఓ కుటుంబం ఆందోళన
నందికొట్కూరు: తమ మూడు సెంట్ల స్థలాన్ని తెలుగు దేశం పార్టీ 5వ వార్డు నాయకుడు అబ్దుల్లా కబ్జా చేశాడని బైరెడ్డి శేషాశేనాయనరెడ్డి నగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. మంగళవారం కబ్జాకు గురైన స్థలం వద్ద తమకు న్యాయం చేయాలని పురుగు మందు, పెట్రోల్ బాటిల్‌తో బాధితులు శేషారాంసింగ్, భార్య మీరాబాయ్ ఆందోళనకు దిగారు.. తమ స్థలం కబ్జా చేయడమే కాకుండా అక్కడికి వస్తే చంపేస్తానని అబ్దుల్లా బెదిరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. అతనితోపాటు మరికొందరు టీడీపీ నాయకులు రసూల్, జమీల్ కూడా బెదిరిస్తున్నారన్నారు. తమ వద్ద ఒరిజనల్ పట్టాలు ఉండటంతో కోర్టును ఆశ్రయించామన్నారు. తీర్పు ఎవరికీ వస్తే వారికే ఆ స్థలం దక్కుతుందని, అప్పటి వరకు పోలీసులే తమకు రక్షణ కల్పించాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు స్థలం కోర్టు పరిధిలో ఉందని ఏర్పాటు చేసిన బోర్డును టీడీపీ నాయకులు తొలగించారన్నారు. కోర్టు, పోలీసుల ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ టీడీపీ నాయకులు దౌర్జన్యంగా బెదరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థలం వద్దకు చేరుకుని బాధితుల వద్ద ఉన్న పురుగు మందు బాటిల్ లాగేశారు. శేషారాంసింగ్ భార్య మీరాబాయ్ పెట్రోల్ పోలీసుల ఎదుటే పోసుకోవడంతో అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టిన బాధితులను పోలీసు స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇంటికి పంపించారు.


