మొరాయించిన సర్వర్‌ | - | Sakshi
Sakshi News home page

మొరాయించిన సర్వర్‌

Jun 2 2026 5:47 AM | Updated on Jun 2 2026 5:47 AM

అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ

కర్నూలు(అగ్రికల్చర్‌): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమవుతోంది. సోమవారం చేపట్టిన జూన్‌ నెల పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. సర్వర్‌ మొరాయించడంతో పంపిణీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. సర్వర్‌ సమస్యల వల్ల కర్నూలు నగరంతో పాటు పలు మండలాల్లో పంపిణీ ముందుకు సాగలేదు. ఇక ఎప్పటిలానే ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ నామమాత్రంగా జరిగింది. సర్వర్‌ సమస్యలను అవకాశంగా తీసుకొని సచివాలయాల్లోనే పంపిణీ చేశారు. అవ్వతాతలు, వికలాంగులు అతి కష్టం మీద వార్డు, గ్రామ సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కర్నూలు నగరంలోని దేవనగర్‌లో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వైపి రమణారెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 87.07 శాతం, నంద్యాల జిల్లాలో 86.96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

పింఛన్‌కు సర్వర్‌ కష్టాలు

నందవరం: పింఛన్‌ కోసం వృద్ధులు, దివ్యాంగులకు కష్టాలు తప్పడం లేదు. మండల పరిధిలోని జొహరాపురం గ్రామంలోని వృద్ధులు, దివ్యాంగులు శ్రీ దత్తత్రేయ మఠం వద్ద పింఛన్‌ పంపిణీ చేసే అధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు రాగానే 3 గంటల పాటు సర్వర్‌ పని చేకపోడంతో ఎండలో అవస్థలు పడ్డారు. ఆ తర్వాత సమస్య పరిష్కారం కావడంతో పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement