రెవెన్యూ సమస్యలే అధికం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యలే అధికం

Jun 2 2026 5:47 AM | Updated on Jun 2 2026 5:47 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నాయని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. ప్రాధాన్యతతో పరిగణించి, జాప్యానికి తావులేకుండా తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘వన్‌ మంత్‌ – ఫోర్‌ విజిట్‌’’లో భాగంగా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి 1,508 ఫిర్యాదులు అందాయన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలో 387, సర్వే శాఖ పరిధిలో 150 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పాఠశాలల సమీపంలో రోడ్లపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. తన పేరుపై ఉన్న పొలాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించి నిషేధిత జాబితాలో చేర్చారని, చర్యలు తీసుకోవాలని నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన ఎం.లక్ష్మీపుల్లయ్య అర్జీ ఇచ్చారు. తనకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించినప్పటికీ స్థలాన్ని చూనపించడం లేదని నందికొట్కూరు మండలం పారుమంచల గ్రామానికి చెందిన ఎస్‌.మూర్తుజావళి ఫిర్యాదు చేశారు. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం కొత్త బోరు ఏర్పాటు చేయాలని ఎస్‌.అబ్దుల్‌ రసూల్‌ అనే వ్యక్తి అర్జీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement