శ్రీగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరికి పోటెత్తిన భక్తులు

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

దగా డీఎస్సీపై నేడు

వైఎస్సార్‌సీపీ నిరసన

నంద్యాల(అర్బన్‌): దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నూనెపల్లె నుంచి కలెక్టరేట్‌ వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి దగా డీఎస్సీపై కలెక్టర్‌ రాజకుమారికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

బెలుం గుహల సందర్శన ప్రియం

కొలిమిగుండ్ల: పర్యాటక శాఖ బెలుం గుహ ల సందర్శన టికెట్లను ధరలను పెంచేసింది. గతంలో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.50 ధర ఉండేది. పెంచిన రేట్ల ప్రకారం పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.70 చొప్పున పెంచినట్లు గుహల యూనిట్‌ మేనేజర్‌ కిషోర్‌ తెలిపారు. పర్యాటక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేట్లు పెంచామన్నారు. గుహలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు శని, ఆదివారాలతో పాటు సెలవుల్లో అత్యధికంగా వస్తుంటారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల కంటే గుహల నుంచి ఆదాయం అధికంగా వస్తుంటుంది.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల(అర్బన్‌): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో 1వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని mee kosam.ap.gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement