● వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల
ఒక్క ఓటు పోకూడదు
● బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కోవెలకుంట్ల: రాష్ట్రంలో సర్ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడుతూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. బనగానపల్లె నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు శనివారం కోవెలకుంట్ల ఎఆర్‌ఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ పరిశీలకులు భూమా కిశోర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు, కర్నూలు నియోజకవర్గ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం సూర్య ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్‌రెడ్డి, కోవెలకుంట్ల మండల కన్వీనర్ బీవీ నాగార్జున రెడ్డి, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీస్ నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు రోషిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. బనగానపల్లె నియోజకవర్గంలో 2,43,464 ఓట్లు ఉన్నాయని, సర్ పేరుతో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రకు అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీఎల్‌ఏలు నిర్లక్ష్యం వహిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సర్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గానికి 20 వేల ఓట్లు తొలగించడానికి అవకాశం ఉందన్నారు. టీడీపీ శ్రేణులు దొంగ ఓట్లను చేర్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలన్నారు. బీఎల్‌ఏలే పార్టీకి కీలకమని, 2029 ఎన్నికల్లో సీఎంగా జగనన్న అయిన తర్వాత కార్యకర్తలకు మంచి భవిష్యత్ ఉంటుందని గుర్తుచేశారు.
జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం..
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుందామని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా జూన్ నెలలో జరిగే సర్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తుల ఓట్లను కాపాడుకోవాలని సూచించారు. ఓటు కీలమైనదని, గ్రామ నాయకులు బీఎల్‌ఏలను సమన్వయం చేసుకుని అధికార పార్టీ దొంగ ఓట్లును తొలగించడంలో చొరవ చూపాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మెహన్ రెడ్డి, సంజామల మండల వైస్ ఎంపీపీ చిన్నబాబు, రాజశేఖర్ రెడ్డి, నాయకులు భీమిరెడ్డి పత్రాప్ రెడ్డి, రవీంద్రరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, హరినాథ్ రెడ్డి, రఘనాథ్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గౌరిగారి నాగేశ్వర్ రెడ్డి, అన్నెం శివరామిరెడ్డి, రామన్న, వాయునంద గౌడు, తల్లెం సుబ్బు, దిల్క్ బాషా, అక్బర్ బాషా, మధుబాబు, సన్నల జనార్దన్ రెడ్డి, బత్తుల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్లలో ప్రజలకు ఒరిగింది శూన్యం
రెండేళ్ల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగింది శూన్యమని కాటసాని రామిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు సర్కార్‌ను పాతాళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగిందన్నారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపునకే పరిమితమైందన్నారు. మహానాడు కార్యక్రమంలో జగన్ నామస్మరణం తప్ప ఏమీ లేదని విమర్శించారు. అరాచకాలు, దౌర్జన్యాలలో బిహార్‌ను ఏపీ మించిపోయిందని కాటసాని ఆరోపించారు.


