వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం | - | Sakshi
Sakshi News home page

వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

నంద్యాల (వ్యవసాయం): పేద, వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని మండల లీగల్‌ సెల్‌ చైర్మన్‌, మూడవ అదనపు జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి అమ్మన్న రాజ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని సబ్‌ జైలును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలు, గదులు, వంటశాలను పరిశీలించి అధికారులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి వారి ఆరోగ్యం, కేసుల గురించి వివరాలను తీసుకున్నారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే లీగల్‌ సెల్‌ హెల్ప్‌లైన్‌ 15100కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో గురు ప్రసాద్‌ రెడ్డి, లోక్‌ అదాలత్‌ సిబ్బంది రామచంద్రారెడ్డి, బాలు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి విరాళం

బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఆళ్లగడ్డ మండలం బాచాపురం గ్రామానికి చెందిన గజ్జల మధుమోహన్‌ రెడ్డి దంపతులు రూ.1.40 లక్షల విరాళం అందజేసినట్లు ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు తెలిపారు. దాతలకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, వేదపండితులు ఆశీర్వదించారు.

ఉయ్యాలవాడలో వర్షం

ఉయ్యాలవాడ: మండలంలో ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీస్తూ శనివారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఈ ఏడాది మే నెల ప్రారంభమయినప్పటి నుంచి ఎండ తీవ్రత రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. గత నాలుగు రోజుల నుంచి మండలంలో 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతను భరించలేక గృహాల్లోనే ఇబ్బందులు పడ్డారు. తొలి సారిగా పలకరించిన వర్షం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. మరో వారం రోజుల్లో ఖరీప్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో వర్షం కురిసింది. దీంతో సాగుకు పొలాన్ని సిద్ధం చేసుకునేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి

బనగానపల్లె రూరల్‌: బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని చంద్రబాబునాయుడు నగర్‌ ఎంపీపీ కస్బా పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో డీఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ప్రభుత్వ బడుల్లో అత్యున్నతమైన విద్యా బోధనతో పాటు పాఠశాలల్లో చేరిన ప్రతి ఒక్కరికి ఉచిత పాఠ్యాపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్నభోజన వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ స్వరూప, సమగ్ర సెక్టోరియల్‌ అధికారులు ప్రసన్నకుమార్‌, జగన్‌మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయులు సత్యప్రకాష్‌, ప్రతాప్‌, అబ్దుల్‌కరీం, సీఆర్పీలు సుధాకర్‌రావు, నాగచంద్రుడు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement