బొమ్మలసత్రం: మహిళా, శిశు భద్రత, రక్షణ కోసం ఆపరేషన్ దండయానను ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత కల్పిస్తూ నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలు పడేలా కలెక్టర్ పర్యవేక్షణలో స్పీడ్ ట్రయల్ మానటరింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు. అత్యాచారాలు, గృహహింస, పోక్సో కేసుల్లో నిందితులపై నిరంతర నిఘా ఉంచుతామన్నారు. మహిళలపై జరిగే నేరాలపై ఇప్పటి నుంచి కేవలం 60 రోజుల వ్యవధిలోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంచలనమైన కేసులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి నిందితులకు అనతికాలంలో శిక్షలు పడేలా చేస్తామన్నారు.


