నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 18 కేంద్రాల్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన గణితం పరీక్షకు 2.149 మందికి గాను 1760 మంది హాజరు కాగా 389 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లాలోని మూడు కేంద్రాల్లో సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..
జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ శంకర్‌నాయక్ తెలిపారు. శుక్రవారం ఫిజిక్స్, వొకేషనల్ పరీక్షలకు 5913 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు గాను 5627 మంది హాజరు కాగా 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. రెండో సంవత్సరం కామర్స్–2, వొకేషనల్–2 పరీక్షలకు 659 మందికి గాను 603 మంది హాజరు కాగా 56మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
రూ.లక్ష విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ కు చెందిన ఎం. కుసుమ కుమారి రాజశేఖర్ రూ.1,00,116 విరాళాన్ని దేవస్థాన పర్యవేక్షకులు కె.శివ ప్రసాద్‌కి అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామి వారి శేషవస్త్రాన్ని, లడ్డూ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
రైళ్లు తాత్కాలిక రద్దు
మద్దికెర: గుంతకల్లు నుంచి బోధన్ వెళ్లే రైలు, బోధన్ నుంచి గుంతకల్లుకు వచ్చే రైలు నేడు, రేపు (30, 31 వతేదీల్లో) తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే గుంతకల్లు నుంచి మార్కాపురానికి వేళ్లే రైలు, మార్కాపురం నుంచి గుంతకల్లుకు వచ్చే రైలు ఈనెల 31, జూన్1 వతేదీల్లో రెండు రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
60 మంది పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలో గ్రేడ్ – 5 నుంచి గ్రేడ్ –4 పంచాయతీ కార్యదర్శులుగా 60 మందికి పదోన్నతి కల్పించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆమోదం తెలిపినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదోన్నతి పొందనున్న పంచాయతీ కార్యదర్శులకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కోసం ఈ నెల 30వ తేదిన ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత కార్యదర్శులు తమ సర్వీస్ పుస్తకంతో హాజరు కావాలని కోరారు.
రానున్న ఐదు రోజుల్లో వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ కేంద్రం వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 30 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాల్లోని అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది. శుక్రవారం శిరువెళ్ల్లలో 39.6 డిగ్రీలు, దొర్నిపాడు 39.6, కొలిమిగుండ్ల 39.4, బనగానపల్లి 39.4, అవుకు 39.2, పాణ్యం 39.1, రుద్రవరం 39, చిప్పగిరి 37.7, మంత్రాలయం 37.4, ఆదోని 37.2, కల్లూరులో 37.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లో గాలీవాన బీభత్సం సృష్టించింది. మంత్రాలయం, పెద్దకడుబూరు, నందవరం మండలాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మొత్తం 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నందవరం మండలంలో భారీ వృక్షాలు సైతం నేల కూలాయి. తీవ్రమైన గాలులు, వానలకు 9 కిలోమీటర్ల విద్యుత్ లైన్‌లు దెబ్బతిన్నాయి. 63 విద్యుత్ స్తంభాలు, ఆరు ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడంతో విద్యుత్ శాఖకు రూ.36 లక్షల నష్టం వాటిల్లింది. నందవరంలో 22 మి.మీ, సి.బెలగల్‌లో 20.4, గూడూరులో 3.4, కోడుమూరులో 3.2, కర్నూలు రూరల్‌లో 1.4, కల్లూరులో 1.2, కర్నూలు అర్బన్‌లో 1 మి.మీ వర్షపాతం నమోదైంది.


