చెరువుల కోసం విద్యుత్‌ చౌర్యం! | - | Sakshi
Sakshi News home page

చెరువుల కోసం విద్యుత్‌ చౌర్యం!

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

రైతుల పేర్లతో విద్యుత్‌ కనెక్షన్లు

అనధికార మోటార్ల ద్వారా

నీటిని సరఫరా

ప్రభుత్వానికి లక్షలాది రూపాయల గండి

నీటిని చెరువులోకి విడుదల చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

రైతు పేరున తీసుకున్న విద్యుత్‌ మీటర్‌

గడివేముల: సామాన్య ప్రజలు విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే అధికారులు పలు కేసులు నమోదు చేస్తారు. అయితే రైతుల పేర్లతో విద్యుత్‌ కనెక్షన్లు తీసుకున్న చేపల చెరువుల నిర్వాహకులు విద్యుత్‌ చౌర్యం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతంలో గోరుకల్లు రిజర్వాయర్‌కు మట్టికోసం రైతుల నుంచి పొలాను కొనుగోలు చేసి మట్టిని తీసుకెళ్లారు. దీంతో పొలాల్లో గుంతలు ఏర్పడంతో వాటిలోనే నీటిని నింపి చేపల చెరువులుగా మార్చారు. గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల, కొరటమద్ది, తిరుపాడు, దుర్వేశి గ్రామాల సమీపంలో 40 చేపల చెరువులను అనధికారికంగా నిర్వహిస్తున్నారు. చేపల చెరువులకు నీటిని తోడుకునేందుకు వ్యవసాయ రైతుల పేర్లతో ఒక్క విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. అనధికారికంగా నాలుగు నుంచి ఐదు మోటర్లకు విద్యుత్‌ వినియోగించుకుంటూ వాటి ద్వారా చెరువులను నింపుకుంటున్నారు. దాదాపు కొన్నేళ్ల నుంచి ఈ విధంగా వ్యవసాయ మోటర్లను చేపల చెరువులకు వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక విద్యుత్‌ అధికారికి చేపల చెరువుల నిర్వాహకులు మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం.

విభేదాలతో ఫిర్యాదులు..

చేపల చెరువుల నిర్వాహకుల మధ్య విభేదాలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఫలితంగా గత ఏడాది డిసెంబర్‌ 26వ తేదీన విజిలెన్స్‌ దాడులు జరిగాయి. అక్రమంగా విద్యుత్‌ను నిర్వహిస్తున్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించి రూ.8 లక్షల దాకా అపరాధ రుసుం విధించారు. ఇప్పటికీ కొంత మంది చేపల నిర్వాహకులు రైతుల పేర్లతో విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని అక్రమ చేపల చెరువులకు నీటిని వినియోగిస్తున్నారు. అక్వా కింద విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుంటే ప్రతి నెలా వేలాది రూపాయల బిల్లు వస్తుంది. అదే రైతు పేరుతో తీసుకుంటే రూ.వంద లోపే బిల్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు తీసేందుకు వెళ్లే విద్యుత్‌ సిబ్బంది ఎన్ని అక్రమంగా కనెక్షన్లు ఉన్నాయన్న విషయం తెలుసుకున్నా పట్టించుకోవడంలేదు. విజిలెన్స్‌ దాడులతో గతంలో జరిమానా చెల్లించిన చెరువుల నిర్వాహుకులు మారడం లేదు. స్థానికంగా వెళ్లి పరిశీలిస్తే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement