స ● వి ● వి ● వి | - | Sakshi
Sakshi News home page

స ● వి ● వి ● వి

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

స ● వి ● వి ● వి

ఆళ్లగడ్డలో

41 డిగ్రీల ఉష్ణోగ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి జిల్లాలో గురువారం ఉష్ణోగ్రతలు పెరిగాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 27న వర్షాలు పడటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ప్రజలు ఊరట చెందారు. ఎల్‌నినో ప్రభావంతో వెంటనే ఉష్ణోగ్రతలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దొర్నిపాడులో 40.8, శిరువెళ్ల 40.8, సంజామల 40.7, బనగానపల్లి 40.5, చాగలమర్రి 40.4, పాణ్యం 40.1, రుద్రవరం 40.1, అవుకు 40, కల్లూరులో 39.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

13 మంది సచివాలయ

ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

కర్నూలు(టౌన్‌): నగరపాలక సంస్థలో పనిచేసే సచివాలయాల ఉద్యోగులకు నగరపాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ నగరంలోని పాతబస్తీలోని గడ్డ వీధి, గరీబ్‌ నగర్‌, జొహరాపురంలోని సచివాలయాలను తనిఖీ చేశారు. ఆ సందర్భంలో పలువురు ఉద్యోగులు కార్యాలయంలో లేరు. మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించగా ఎలాంటి వివరాలు లేకపోవడంతో గైర్హాజరైన ఉద్యోగులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కమిషనర్‌ ఆయా సచివాలయాల్లో పనిచేసే 13 మంది ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో తగిన కారణాలు తెలియజేస్తూ వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

ఎల్‌ఎల్‌బీ సెమిస్టర్‌ పరీక్షల

ఫలితాలు విడుదల

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జనవరి నెలలో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ 3, 5 సంవత్సరాల కోర్సు 6, 8, 10వ సెమిస్టర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు. ఫలితాలు https://rayalase emauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement