యూరియా ఏమవుతోంది | - | Sakshi
Sakshi News home page

యూరియా ఏమవుతోంది

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

యూరియా ఏమవుతోంది

సాగు 3వేల హెక్టార్లు..

యూరియా 4,861 టన్నులు!

గతంలో ఎప్పుడూ లేని విధంగా

వేసవిలో పెరిగిన అమ్మకాలు

2020 నుంచి 2024 మధ్య వేసవిలో

అమ్మకాలు 1000 టన్నులే..

గత ఏప్రిల్‌ నెలలోనే

కర్నూలు జిల్లాలో 2,161,

నంద్యాల జిల్లాలో 2,700 టన్నుల

అమ్మకాలు

అడ్డగోలు అమ్మకాలపై

కలెక్టర్‌, జేసీ సీరియస్‌

ఉమ్మడి జిల్లాలో 59 మంది డీలర్ల

లైసెన్స్‌లు తాత్కాలిక సస్పెన్షన్‌

కర్నూలు సబ్‌ డివిజన్‌లోని గూడూరు మండలంలో ప్రతి బస్తా యూరియాకు లింక్‌లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నా వ్యవసాయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌, జేసీలు యూరియాపై దృష్టి పెట్టడంతో అప్రమత్తమైన వ్యవసాయ అధికారులు కర్నూలు జిల్లాలో 19, నంద్యాల జిల్లాలో 40 ఎరువుల షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు. లైసెన్స్‌ సస్పెన్షన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి అమ్మకాలు చేపట్టరాదు. అయినప్పటికీ డీలర్లు యథావిధిగా అమ్మకాలు సాగిస్తుండటం అధికారులకు చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

యూరియాకు లింక్‌ పెడుతున్న పనికిరాని

ఎరువులు ఇవే

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ ఆరంభానికి ముందే యూరియా కొరత ఆందోళన కలిగిస్తోంది. మార్చి నుంచి మే నెల వరకు వ్యవసాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. బావులు, బోర్ల కింద అక్కడక్కడ వేరుశనగతో పాటు కూరగాయల పంటలు సాగు చేయడం పరిపాటి. కొన్ని ప్రాంతాల్లో బోర్ల కింద పత్తి కూడా సాగవుతోంది. అయితే యూరియా అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని ర్యాక్‌ పాయింట్లకు వచ్చే యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను 50 శాతం మార్క్‌ఫెడ్‌కు, మరో 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇస్తున్నారు. మార్క్‌ఫెడ్‌కు ఇచ్చిన యూరియా బఫర్‌లో ఉండగా.. ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నేతలకు మినహా సాధారణ రైతులకు యూరియా బస్తా లభించని పరిస్థితి నెలకొంది.

ఏప్రిల్‌లో 4,861 టన్నుల

యూరియా అమ్మకాలు

2020 నుంచి 2024 వరకు పరిశీలిస్తే వేసవిలో యూరియా అమ్మకాలు అతి తక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తం మీద 1000 టన్నుల వరకే అమ్మకాలు జరిగాయి. 2025 నుంచి వేసవిలో యూరియా అమ్మకాలకు రెక్కకొచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వానికి ప్లానింగ్‌ లేకపోవడం, డిమాండ్‌ను అంచనా వేయడంలో విఫలమవడం, డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేయడంలో చేతులెత్తేయడంతో ఉన్న యూరియా బంగారం అవుతోంది. వేసవిలో వచ్చిన యూరియాను వచ్చినట్లు డిమాండ్‌ బాగా ఉన్న ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఏప్రిల్‌ నెలలో 2161 టన్నులు, నంద్యాల జిల్లాలో 2700 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తంగా వేసవిలో 3వేల హెక్టార్లలో కూడా పంటలు లేవు. అయితే ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఉమ్మడి జిల్లాలో 4,861 టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో అమ్మకాలు..

ఏప్రిల్‌, మే నెలల్లో నమోదు

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం యూరియా బయోమెట్రిక్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే విక్రయించాలి. ఏ రోజుకారోజు జరిగిన అమ్మకాలను ఈ–పాస్‌ మిషన్‌లో నమోదు చేసి బయోమెట్రిక్‌ వేయాలి. జిల్లాలో మాత్రం ఫిబ్రవరి నెలలో యూరియా అమ్మకాలు జరిగితే ఏప్రిల్‌ నెలలో ఈ–పాస్‌ మిషన్‌లో నమోదు చేయడం గమనార్హం. అన్నీ సర్దుబాటు చేసుకున్న తర్వాత ఈ–పాస్‌లోకి ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్‌, జేసీలే ఆశ్చర్యపోయినట్లు సమాచారం. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ జిల్లా వ్యవసాయ యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం.

ఇతర ఉత్పత్తులు తీసుకుంటేనే యూరియా

ప్రయివేటు డీలర్లు యూరియాతో కాసుల పంట పండించుకుంటున్నారు. యూరియా బస్తా ధర రూ.266 మాత్రమే. డిమాండ్‌ పెరగడంతో బ్లాక్‌లో కొనడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరు డీలర్లు ఇతర ఉత్పత్తులను లింక్‌ పెట్టి అడ్డగోలుగా అమ్మకాలు సాగిస్తున్నారు. పంటకు ఏ మాత్రం ఉపయోగపడని వాటిని బస్తా రూ.1,500 ప్రకారం అంటగడుతూ యూరియాను మాత్రం ఎంఆర్‌పీ కంటే తక్కువకే ఇస్తుండటం గమనార్హం. ఈ బాగోతం కౌతాళం, ఎమ్మిగనూరు, హొళగుంద, ఆదోని, గూడూరు తదితర ప్రాంతాల్లో అధికంగా సాగుతోంది. సీ్త్ర శక్తి, భూశక్తి, గ్రోశక్తి పేర్లతో ఇతర ఉత్పత్తులను లింక్‌ పెట్టి డీలర్లు రైతులను దోచుకుంటున్నారు.

దారి మళ్లిన యూరియా

గత ఏడాది కౌతాళం, హొళగుంద, ఎమ్మిగనూరు తదితర మండలాల నుంచి యూరియా కర్ణాటకకు తరలినట్లు విమర్శలు ఉన్నాయి. ఆలూరు నియోజకవర్గంలోని ఓ మండలానికి కేటాయించిన యూరియా కర్ణాటకకు మళ్లిందని ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదు వెల్లింది. దీనిపై ఇప్పటికీ విచారణ సాగుతోంది. ఈ సారి ముందస్తుగానే వేసవిలో వచ్చిన యూరియాను దారి మళ్లిచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు, నాలుగేళ్లతో పోలిస్తే ఈ సారి వేసవిలో భారీగా యూరియా అమ్మకాలు పెరగడంపై కలెక్టర్‌, జేసీలు విచారణ జరుపుతుంటే.. వ్యవసాయ యంత్రాంగం మాత్రం వేసవిలో బోర్ల కింద సాగు పెరిగిందని నమ్మించే ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఒక్క బస్తా దొరికితే ఒట్టు

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కర్నూలు జిల్లాకు సంబంధించి 45,599 టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 22,916 టన్నుల యూరియా వచ్చింది. ఇందులో సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ గోదాములు, రీటైల్‌/హోల్‌సేల్‌ డీలర్లు, కంపెనీ గోదాముల్లో రైతులకు 17,530 టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే మార్కెట్‌లో మాత్రం యూరియా దొరకని పరిస్థితి. ఇదిలాఉంటే నంద్యాల జిల్లాలో 27వేల టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నా.. పీఏసీఎస్‌లు, రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్‌ల్లో బస్తా యూరియా కూడా కనిపించకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement