నంద్యాల(అర్బన్): జిల్లాకు చెందిన పలువురు నేతలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామకాల ప్రకటన వెలువడింది. పాణ్యానికి చెందిన బెల్లం మహేశ్వరరెడ్డిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా, శ్రీశైలానికి చెందిన కె.శివారెడ్డిని రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా, శ్రీశైలానికి చెందిన వంగాల నాగేశ్వరరెడ్డిని రాష్ట్ర రైతు విభాగం సహాయ కార్యదర్శిగా నియమించారు.
ఈఓల హాజరు తప్పనిసరి
నంద్యాల(వ్యవసాయం): మండల కేంద్రాల్లో సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఈఓలు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా దేవాదాయ శాఖ అధికారి పాండురంగారెడ్డి తెలిపారు. నంద్యాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌కు గైర్హాజరైన ఈఓలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవదాయ శాఖపై ప్రజల్లో, భక్తుల్లో మరింత సానుకూల స్పందన ఏర్పడేలా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.
ఆళ్లగడ్డలో నేడు పీజీఆర్‌ఎస్
నంద్యాల(అర్బన్): ‘వన్ మంత్ – ఫోర్ విజిట్’’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరు కావాలన్నారు.
ఆయిల్ నిక్షేపాల కోసం అన్వేషణ
పాణ్యం: ఆయిల్ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ కంపెనీ అధికారులు గురువారం పాణ్యంలోని వద్దెల వాగు సమీపంలోని పొలాల్లో అన్వేషణ చేపట్టారు. బోర్‌వెల్ సాయంతో తవ్వకాలు ప్రారంభించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆయిల్ నిక్షేపాల కోసం కనీసం ఒక్కో చోట 70 నుంచి 150 అడుగుల వరకు తవ్వకాలు చేపడుతున్నట్లు వారు చెప్పారు.
గోసంరక్షణ నిధికి రూ.11లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణ నిధి పథకానికి హైదరాబాద్‌కు చెందిన ఇందుకూరి వెంకటరామకృష్ణంరాజు రూ.11,11,116 విరాళంగా చెల్లించారు. గురువారం దేవస్థాన ఈఓ క్యాంప్ కార్యాలయంలో దేవస్థాన ఈఓ శ్రీనివాసరావును కలిసి ఈ మేరకు విరాళ చెక్కును అందజేశారు. అనంతరం విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
భవన నిర్మాణ కార్మికులకు పథకాల పునరుద్ధరణ
కర్నూలు(అర్బన్): భవన నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ పథకాలను వివరించారు. వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు భవన, ఇతర నిర్మాణ రంగ గుర్తింపు కార్డు కలిగిన కార్మికులు తమ పరిధిలోని సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రెటరీ ద్వారా AP - SEVA పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


