బ్లండ్ బ్యాంకుల్లో నిల్వ ఉన్న రక్తం యూనిట్లలో..
బాధ్యత బ్లడ్ బ్యాంకులదే!
● స్టోరేజీ కెపాసిటీ 7,326 యూనిట్లు ● అందుబాటులో ఉన్నది 1,298 యూనిట్లు
● ముందుచూపు లేని బ్లడ్ బ్యాంకులు ● కర్నూలు పెద్దాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి
● రక్తదాన శిబిరాలు నిర్వహించని వైనం
కర్నూలు(హాస్పిటల్): రక్తం అందుబాటులో లేకపోవడంతో రోగులు విలవిల్లాడుతున్నారు. దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 19 రక్తనిధులు(బ్లడ్‌బ్యాంకులు) ఉన్నాయి. వాటిలో బ్లడ్ స్టోరేజ్ కెపాసిటీ 7,326 యూనిట్లు. అయితే ప్రస్తుతం 1,298 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరానికి రక్తం లభించక వారి కుటుంబీకులు ఇబ్బందులు పడుతున్నారు. రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా లభించడం లేదు. దీంతో ఆయా బ్లడ్ బ్యాంకుల్లోని దాతల జాబితా తీసుకుని వారికి ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు.
నెగిటివ్ గ్రూపులు మరింత కొరత
జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో పాజిటివ్ గ్రూపుల కంటే నెగిటివ్ గ్రూపుల రక్తం కొరత మరింత తీవ్రంగా ఉంది. మొత్తం బ్లడ్‌బ్యాంకుల్లో ఏ నెగిటివ్ గ్రూపు రక్తం స్టోరేజ్ కెపాసిటీ 238 యూనిట్లు కాగా కేవలం 15 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అలాగే బీ నెగిటివ్ గ్రూపు 253 యూనిట్లు కాగా 35 యూనిట్లు, ఏబీ నెగిటివ్ రక్తం 187 యూనిట్లు కాగా కేవలం 6 యూనిట్లు, ఓ నెగిటివ్ గ్రూపు రక్తం 210 యూనిట్లు ఉండాల్సి ఉండగా కేవలం 18 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో రోగుల సహాయకులు అవసరమైన రక్తం కోసం ముప్పుతిప్పలు పడుతున్నారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో స్టోరేజి కెపాసిటీకి గాను ఒక్క యూనిట్ కూడా నెగిటివ్ గ్రూపు బ్లడ్ ఉండకపోవడం గమనార్హం. దాతలు ఎక్కువగా ఆయా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులే ఉండటం, ఆయా కళాశాలలకు ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో దాతలు సమయానికి లభించడం కష్టమవుతోంది.
ప్రత్యామ్నాయ చర్యలు ఏవీ?
బ్లడ్ బ్యాంకులకు అధికంగా దాతల నుంచి రక్తాన్ని సేకరిస్తారు. దాతలు అధికంగా ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థులు ఉంటారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బ్లడ్ బ్యాంకులకు రక్తం కొరత ఏర్పడింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి, విద్యార్థులు గాకుండా ఇతర సంఘాలు, యువజన సంఘాల ద్వారా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి నిల్వ చేసుకోవాల్సి ఉంది. అయితే బ్లడ్ బ్యాంకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్లడ్ బ్యాంకుల్లో కనీస నిల్వలు లేకపోవడంతో రోగుల సహాయకులు సమయానికి రక్తం లభించక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి అవసరమైన గ్రూపు రక్తం ఉండే దాతలు లభించక ఇబ్బందులు పడుతున్నారు.
బ్లడ్‌బ్యాంక్ పేరు అవసరం ఉన్నది
కర్నూలు పెద్దాసుపత్రి 900 183
ఆదోని 200 34
నంద్యాల 295 29
ఇండియన్ 425 149
రెడ్‌క్రాస్ సొసైటీ
బ్లడ్ బ్యాంకులు నిబంధనల మేరకు నడుస్తున్నాయా లేదో చూస్తాం. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు అయితే నిబంధనల మేరకు రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ రక్తనిధికి ఇవ్వాలి. రక్తం నిల్వ చేసుకోవాల్సిన బాధ్యత ఆయా బ్లడ్ బ్యాంకులదే. – ఎల్.భాస్కర్,
జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్


