న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

కర్నూలు: న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ సూచించారు. కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్‌లో న్యాయవాదులకు న్యాయ వృత్తిపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చంద్రుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిహరనాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో రాణించాలనుకునే వారికి అనేక రకాల ఉపాధి కల్పనలు ఉన్నాయన్నారు. కోర్టులలో డిజిటల్‌ ఫైలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణ వేగవంతం చేయవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌, మధ్యవర్తిత్వం, రాజీ ద్వారా కేసులు త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి కేసుకు టైమ్‌లైన్‌ ఏర్పాటు చేసుకుని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. న్యాయవాది కోర్టులో చట్టం ప్రకారం ఏది సరైనదో క్లెయింట్లకు వివరించాలన్నారు. నిజాన్ని వెలికితీయడంలో కోర్టుకు సహకరించాలన్నారు. పేదలకు, సమాజానికి సంబంధించిన కేసులను ఉచితంగా వాదించాలని కోరారు. జూనియర్‌ న్యాయవాదులు అడిగిన సమస్యలకు ఈ సందర్భంగా ఆయన పరిష్కార మార్గాలను తెలియజేశారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ మహేశ్వర రెడ్డి, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ శివరామచంద్రరావు, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సులోచన, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement