● జనరల్ మేనేజర్ రామాంజనేయులుకు
ఇన్‌చార్జి బాధ్యతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ)గా పనిచేస్తున్న శివలీల ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాలతో ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చైర్మన్ డి.విష్ణువర్ధన్‌రెడ్డికి మంగళవారం ఆమె రాతపూర్వకంగా రాసిచ్చారు. శివలీల సీఈఓగా మార్చి మొదటి వారంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత 20 రోజుల పాటు సెలవుల్లో ఉన్నారు. సెలవుల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సీఇవో పోస్టును వ్యక్తిగత కారణాలతో వదులుకుంటున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమె వినతిని చైర్మన్ ఆమోదించారు. వెంటనే డీసీసీబీలో జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.రామాంజనేయులును ఇన్‌చార్జి సీఈఓగా నియమించారు. సీఈఓ పోస్టు నుంచి తప్పుకున్న శివలీల జనరల్ మేనేజర్‌గా కొనసాగనున్నారు.
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: చెంచులకు శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని బుధవారం కల్పించారు. తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద వారికి దేవస్థాన ఽఅధికారులు ఆహ్వానం పలికారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేసిన చెంచు భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బంగారు హారం బహూకరణ
శ్రీశైలం టెంపుల్: శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి బుధవారం నెల్లూరుకు చెందిన పెళ్లకూరు దామోదర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 22 గ్రాముల బంగారు లక్ష్మీకాసుల హారాన్ని సమర్పించారు. హారాన్ని తీసుకున్న అనంతరం ఆలయ అధికారులు దాతకు రశీదును, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
17 మండలాల్లో వర్షాలు
● మంత్రాలయంలో
48.2 మి.మీ వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం 11 గంటల వరకు జల్లులు పడ్డాయి. 17 మండలాల్లో వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆదోనిలో 36.2, సి.బెళగల్‌లో 31.2, ఎమ్మిగనూరులో 30.2, కౌతాళంలో 26.8, పెద్దకడుబూరులో 24.8, కోసిగిలో 20.6, నందవరంలో 16.8, గోనెగండ్లలో 15.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 26 వరకు ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా పలు మండలాల్లో వర్షాలు పడటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే నమోదయ్యాయి. ఆదోనిలో 28.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కర్నూలు డీఎస్పీకి పదోన్నతి
కర్నూలు: కర్నూలు డీఎస్పీ జె.బాబుప్రసాద్‌కు అడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఏపీలో 20 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా, 41 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలు గా పదోన్నతి కల్పిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌కు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వాటర్స్ మంగళగిరిలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కడప జిల్లాకు చెందిన బాబుప్రసాద్ 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. 2004లో సీఐగా, 2014లో డీఎస్పీగా పదోన్నతి పొందారు.


