పట్టా భూమిలో టీడీపీ నాయకుల మట్టి దందా | - | Sakshi
Sakshi News home page

పట్టా భూమిలో టీడీపీ నాయకుల మట్టి దందా

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

అడ్డుకున్న బాధిత రైతులు

బెదిరించిన అధికార పార్టీ నాయకులు

నంద్యాల(అర్బన్‌): టీడీపీ నాయకుల మట్టి దందా పట్టా భూముల్లోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న బాధిత రైతులు పొలం వద్దకు వెళ్లి అక్రమార్కులను అడ్డుకోగా మమ్మల్నే అడ్డుకుంటావా జేసీబీతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఎదురు తిరిగితే అంతు చూస్తామని హెచ్చరించారు. చేసేది లేక తహసీల్దార్‌ శ్రీవాణికి జరిగిన విషయం అర్జీ ద్వారా బుధవారం వివరించారు. బాధిత రైతు ఉప్పరి మహేష్‌ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం కానాల గ్రామం నాగమ్మ చెరువులో గత 50 ఏళ్ల క్రితం నుంచి ఉప్పరి మహేష్‌ తండ్రి ఉప్పరి హుసేనయ్య పేరున సర్వేనం.1269లో 3.02 ఎకరాల పట్టా భూమి సాగులో ఉంది. ఇటీవల టీడీపీకి చెందిన కొంత మంది నాయకులు చెరువు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 1269 సర్వేనం.లోని ఎకరా పొలంలో లోతైన గుంతలు తీసి మట్టిని తరలించారు. విషయం తెలుసుకున్న బాధిత రైతులు ఉప్పరి మహేష్‌, హుసేనయ్యలు అక్కడికి వెళ్లారు. తమ పొలంలో మట్టిని తరలించడాన్ని చూసి నివ్వెర పోయారు. రిజిస్టర్‌ పొలంలో మట్టిని తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రిజిస్టర్‌ పొలమంటూ తెలియదని, పొలాన్ని చదును చేసే పరిస్థితి ఉండదని, దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. ప్రాణ భయంతో వణికిపోయిన రైతులు తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్‌ శ్రీవాణికి వినతి పత్రం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement