దొర్నిపాడు: తప్పుల్లేని ఓటరు జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. గుండుపాపల గ్రామంలో ఎస్‌ఐఆర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యాక్రమాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమయ్యాయరు. ఓటరు మ్యాపింగ్, క్షేత్రస్థాయిలో సర్వే విధానం, జనగణన ప్రక్రియపై అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తప్పుల్లేని ఓటరు జాబితాను తయారు చేయాలన్నారు. మెట్టుపల్లి లక్ష్మి అనే మహిళ పేరు ప్రస్తుతం ఓటర్ల జాబితాలో ఉండగా 2022 జాబితాలో లేకపోవడం కలెక్టర్ గమనించి వివరాలు ఆరా తీశారు. సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆమె పుట్టినిల్లు బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామంగా తెలుసుకున్న కలెక్టర్ అక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ 169లో ఉన్న ఓటరు వివరాలను పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీఓ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.


