చంద్రబాబు ప్రభుత్వంలో నిర్వీర్యమైన సేవలు
రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పుతో సరి
ఇప్పటికే 160 ఆర్‌బీకేలు మూత
ఈ పోస్టులన్నీ అధికారికంగానే రద్దు
ప్రతి అవసరానికి మండల కేంద్రానికి రైతుల పరుగులు
అందుబాటులో లేని యూరియా, డీఏపీ
ఇతర సేవలకు వీఏఏ, వీహెచ్‌ఏలు
● వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి రైతులకు సేవలు అందించాల్సిన వీఏఏ, వీహెచ్‌ఏలను చంద్రబాబు ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోంది.
● నిరంతరం ఏదో ఒక సర్వే చేపడుతూ.. ఇందులో వీఏఏ, వీహెచ్‌ఏలను సైతం భాగస్వాములను చేస్తుండటంతో రైతులకు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడుతోంది.
డోన్ మండలం కొత్తపల్లిలో సేవలకు దూరమైన రైతుభరోసా కేంద్రం
కర్నూలు(అగ్రికల్చర్): దేశానికే రోల్‌మోడల్‌గా గుర్తింపు పొందిన రైతుభరోసా కేంద్రాలు (రైతు సేవా కేంద్రాలు) నేడు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుతోనే వీటి మనుగడ ప్రశ్నార్థకమైంది. రైతుభరోసా కేంద్రాల పేరుతోనే కొనసాగితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల మదిలో చిరస్థాయిగా ఉండిపోతారనే అక్కసుతో రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు చేశారు. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో రైతన్నలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి ఎన్ని కష్టాలు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ ఆ రోజులు పునరావృతం అవుతున్నాయి. వైఎసార్‌సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్‌బీకేలు(ఆర్‌ఎస్‌కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849 ఆర్‌బీకేలు ఉండగా.. 28 ఆర్బన్ ప్రాంతాల్లో సేవలందించాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్‌బీకేలకు సొంత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్‌బీకేలకు అపురూపమైన సొంత భవనాలు రూపుదిద్దుకోవడం విశేషం.
రైతులకు విశేషంగా సేవలు అందించిన ఆర్‌బీకేలను చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది చేపట్టిన రేషనలైజేషన్ ద్వారా కర్నూలు జిల్లాలో 408, నంద్యాల జిల్లాలో 309 మిగిలాయి. కర్నూలు జిల్లాలో 58, నంద్యాల జిల్లాలో 102 రైతుభరోసా కేంద్రాలను మూసివేయడం గమనార్హం. ఆర్‌బీకేలు మూతపడటంతో 160 పోస్టులు రద్దయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న పలు ఆర్‌బీకేలకు వీఏఏ, వీహెచ్‌ఏ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో సెరికల్చర్‌కు సంబంధించి 13 వీఎస్‌ఏలను గత వైఎసార్‌సీపీ ప్రభుత్వం నియమించింది. వీరందరికీ పదోన్నతులు లభించాయి. ఆ తర్వాత వీటిని భర్తీ చేయడం పక్కనపెడితే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రద్దు చేసింది.
రైతు గ్రంథాలయం కనుమరుగు
రైతుల్లో వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచేందుకు ప్రతి ఆర్‌బీకేలో 50 పుస్తకాలతో రైతు గ్రంథాలయం ఏర్పాటైంది. నేడు ఆర్‌బీకేల్లో గ్రంథాలయాల ఉనికే లేకుండా పోయింది. వీటి ద్వారా ఆర్‌బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేయడం జరిగేది. నేడు ఆర్‌బీకేలు గ్రామాల్లో దిష్టిబొమ్మలను తలిపిస్తున్నాయంటే ప్రభుత్వం ఏస్థాయిలో కక్షగట్టిందో అర్థమవుతోంది.
దిష్టిబొమ్మల్లా
రైతు భరోసా కేంద్రాలు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్‌బీకేల వ్యవస్థ వ్యవసాయ శాఖలో సరికొత్త విప్లవం. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడం, ఇందుకు అవసరమైన అన్ని రకాల ఇన్‌పుట్స్(విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు)తో రైతులకు అండగా నిలిచాయి. ఖరీఫ్, రబీ సమయాల్లో ఆర్‌బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధకశాఖ, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు ఆర్‌బీకేల ద్వారానే అమల య్యాయి. రైతులకు విశేష సేవలు అందించిన ఆర్‌బీకేలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఆర్‌బీకేల ద్వారా నేడు రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర ఏ విధమైన సేవలు అందని పరిస్థితి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించిన ఏ అవసరానికై నా డిజిటల్ కియోస్క్ ద్వారా ఆర్డర్ పెడితే కొన్ని గంటల్లోనే రైతులకు అందుబాటులోకి వచ్చేవి. నేడు డిజిటల్ కియోస్క్‌లు మూలన పడ్డాయి.


