మంత్రి ఇలాఖాలో పేట్రేగుతున్న మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాఖాలో పేట్రేగుతున్న మట్టి మాఫియా

May 27 2026 10:14 AM | Updated on May 27 2026 10:14 AM

చెరువులను కొల్లగొడుతున్న తెలుగు తమ్ముళ్లు

దర్జాగా అక్రమ తవ్వకాలు

వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్న వైనం

మామూళ్ల మత్తులో అధికారులు

నంద్యాల(అర్బన్‌): రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నంద్యాల నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగుతోంది. అనుమతులు లేకుండా కుందూ నది, చెరువులు, కుంటల్లో ఇసుక, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు తరలించి రోజు రూ. లక్షల్లో పోగేసుకుంటున్నారు. నంద్యాల మండలంలోని భీమవరం, ఊడుమాల్పురంతో పాటు గోస్పాడు మండలంలోని రాయపాడు గ్రామాల సమీపంలోని కుందూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అదే విధంగా నంద్యాల చిన్న చెరువు, కానాల నాగమ్మ చెరువు, మిట్నాల చెరువు కుంటల్లో వందలాది టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మట్టి, ఇసుక అక్రమ తరలింపుపై రైతులు, ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో టీడీపీ నాయకుల మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. కానాల నాగమ్మ చెరువు నుంచే రోజుకు 100 ట్రాక్టర్లతో దాదాపు 800 నుంచి 1000 ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. ఒక్కో ట్రిప్పుకు ట్రాక్టర్‌ యజమానికి రూ.330 మాతమ్రే చెల్లిస్తుండగా బయట రూ.700 నుంచి రూ.900 మధ్యన విక్రయిస్తూ సొమ్ము చేసుకుంున్నారు. మొత్తం మీద నంద్యాల చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులు, కుంటల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. పట్టపగలే బహిరంగంగానే జేసీబీలు ఏర్పాటు చేసి ఇష్టారీతిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ మట్టి మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేత హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన అండతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోంది.

మామూళ్లతో సరిపెట్టుకుని...

చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నా ఇరిగేషన్‌ అధికారులు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు. పట్టణ సమీపంలోని నంద్యాల చిన్న చెరువుతో పాటు భీమవరం వద్ద ఉన్న కుందూనది మట్టి, పట్టణంలోని 1వ వార్డు, ఊడుమాల్పురం, రాయపాడు వద్ద ఉన్న కుందూ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్‌ అధికారి అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. అధికార పార్టీ నేత ఆదేశాలతో కనీసం ఇరిగేషన్‌ సిబ్బంది కూడా అటు వైపు వెళ్లకుండా అతను అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు చుట్టపు చూపుగా వెళ్లి మట్టి మాఫియా ఇచ్చే మాముళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఓ వైపు జలధార.. జలహారతి అంటూ చెరువుల పరిరక్షణ పేరుతో పనులు జరుగుతుండగా.. మరో వైపు మట్టి మాఫియా చెరువులను కొల్లగొడుతున్నా జిల్లా ఉన్నతాధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement