● అరుదైన రికార్డు సాధించిన
ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి
● జనవరి నుంచి ఏప్రిల్ వరకు
1,024 మందికి ప్రసవాలు
ఎమ్మిగనూరురూరల్: ప్రసవాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి మరోసారి కై వసం చేసుకుంది. ఈ ఆసుపత్రిలో ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 30 పడకల ఆసుపత్రి నుంచి వంద పడకల హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ అయ్యింది. నాలుగేళ్లుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం 1,024 మందికి ప్రసవాలు కాగా అందులో 281 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. ఇందుకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ చంద్రబాబు నుంచి ప్రశంసాపత్రం వచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ సోమవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటల్స్‌లో ఐదో సారి మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
సేవలు ఇలా..
ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్ ముగ్గురు గైనకాలజిస్టులకు అందుబాటులో ఉన్నారు. నెలకు 280 నుంచి 340కి పైగా నార్మల్ డెలివరీలు, సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు, సాధారణ చెకప్‌లు అందిస్తున్నారు. అర్ధరాత్రి అయినా అత్యవసరమైన కాన్పుకోసం వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.
ఒక్క రోజే 500 మందికి స్కానింగ్
ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, పెద్దకడుబూరు, కోసిగి మండలాల నుంచి వచ్చే గర్భవతులకు ప్రతి నెలా 9న స్కానింగ్ పరీక్షలకు చేస్తారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సుజిత, ఫాతిమా, హిమబిందు గర్భవతులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ప్రతి నెలా 9వ తేదీ ఒక్కరోజే 490 నుంచి 500 మందికి పైగానే గర్భవతులకు స్కానింగ్ పరీక్షలు చేసి టాప్‌లో నిలుస్తున్నారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్‌కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం. నార్మల్ డెలివరీలతో పాటు సిజేరియన్‌లు, కుటుంబనియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు 41 మందికి స్టేమీ ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాం.
– డాక్టర్ ఆదినాగేష్, సూపరింటెండెంట్
సంవత్సరం (ఏప్రిల్–మార్చి) నార్మల్ డెలివరీ ీసిజేరియన్ మొత్తం
2022-23 (ఏప్రిల్–మార్చి) 2,778 517 3,295
2023-24 (ఏప్రిల్–మార్చి) 2,642 62 2,704
2024-25 (ఏప్రిల్–మార్చి) 3,419 607 4,026
2025-26 (ఏప్రిల్–ఢిశంబర్) 1,709 553 2,262
2026 జనవరి–ఏప్రిల్ 743 281 1,024


