పూల మార్కెట్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

పూల మార్కెట్‌లో చోరీ

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

డోన్‌ టౌన్‌: పట్టణంలోని నంద్యాల, కర్నూలు రైల్వే గేట్ల మధ్యలో ఉన్న పూల మార్కెట్‌లో సోమవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని నిందితుడు ముఖానికి మాస్క్‌ ధరించి పూల మార్కెట్‌లోని పది దుకాణాలకు ఉన్న షట్టర్‌ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వ్యాపారస్తులు పూల శ్రీను, ఖాజా మస్తాన్‌ వలి, ఉప్పరి శ్రీను, తారా, రవి, వీరేష్‌, భీముడు, రషీద్‌, చిన్నన్న, రాజు వారికి చెందిన దుకాణాల్లో చోరీకి పాల్పడ్డాడు. ఓ బైకుతో పాటు దాదాపు రూ.20వేల వరకు నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫారెస్ట్‌ అధికారులకు నెమలి అప్పగింత

పగిడ్యాల: ఎం. ఘణపురం గ్రామంలో ఆదివారం లభ్యమైన నెమలిని ఆత్మకూరు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ జ్యోతిస్వరూప్‌కు పంచాయతీ కార్యదర్శి అనిల్‌ సోమవారం అప్పగించారు. గ్రామ సమీపలోని పంట పొలాల్లోకి మేత కోసం వచ్చిన నెమలిని కుక్కలు తరుముతూ వెంటపడ్డాయి. ఇది గమనించిన గ్రామస్తులు నెమలిని కుక్కల బారి నుంచి రక్షించి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్‌కు అప్పగించారు. కుక్కల దాడిలో గాయాలకు గురైన నెమలికి పశువైద్యాధికారి విజయ్‌ చికిత్స చేశారు. అనంతరం ఆత్మకూరు ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం అధికారులు ఘణపురం గ్రామానికి చేరుకుని నెమలిని స్వాధీనం చేసుకున్నారు.

ట్రాలీ ఆటో బోల్తా.. కోడిగుడ్లు నేలపాలు

ఎమ్మిగనూరురూరల్‌: ఆదోని నుంచి రాయచూర్‌కు కోడిగుడ్లను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో సోమవారం నలందా కాలేజీ సమీపంలో బోల్తా పడింది. అందులో ఉన్న కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చిందరవందరగా పడిపోయాయి. కోడిగుడ్లు పగిలిపోయి రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement