నంద్యాల(న్యూటౌన్): గోరుకల్లు, అలనూరు రిజర్వాయర్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, రైతులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, ఉపాధి హామీ పథకంలో ఫేస్ యాప్, రెండు పూటల పని విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎదుట రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. సంఘాల సమన్వయ కమిటీ నాయకుడు సుబ్బారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. కౌలు రైతులకు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఉపాధి పనులు చేసే చోట తాగునీటి సౌకర్యం కల్పించి కూలీలందరికీ పనిముట్లు ఇవ్వాలని కోరారు. పెట్రోల్, డీజల్, గ్యాస్, ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు భాస్కర్, సురేష్, శ్రీనివాసరెడ్డి, ఏలియా, నాయక్, డేవిడ్, కరీముల్లా, రత్నమయ్య పాల్గొన్నారు.


