కోడుమూరు రూరల్: మండలంలోని బైన్‌దొడ్డి తిప్పను సోమవారం మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు పరిశీలించారు. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బైన్‌దొడ్డి తిప్ప నుంచి గత కొద్ది నెలలుగా యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు. ఎర్రమట్టి మాఫియాపై ‘సాక్షి’ దినపత్రికలో ఈనెల 17న ‘బైన్‌దొడ్డి..కొల్లగొట్టి’, 22న ‘కరిగిపోతున్న బైన్‌దొడ్డి’ అనే శీర్షికలతో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలకు మైనింగ్ అండ్ జియాలజీ ఇన్‌స్పెక్టర్ శివపార్వతి, టెక్నికల్ అసిస్టెంట్ బాలునాయక్ స్పందించి సోమవారం బైన్‌దొడ్డి తిప్పను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శివపార్వతి మాట్లాడుతూ.. బైన్‌దొడ్డి తిప్ప నుంచి ఎర్రమట్టి తరలించేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎవరైనా అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి ఎర్రమట్టి తవ్వకాలు చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.


