శిరివెళ్ల: కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేస్తు న్నారు. ఆయా పాఠశాలల్లోని తరగతి గదులు, హెచ్‌ఎం, స్టాఫ్ రూంలలో సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. జిల్లాలోని 43 పాఠశాలలో 730 సీసీ కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి మండలంలోని శిరివెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్‌లో పనులు జరుగుతున్నాయి. ప్రతి తరగతి గదికి సీసీ కెమెరా ఏర్పాటుతో విద్యార్థులపై పర్యవేక్షణ మరింత సులువవుతోంది. శిరివెళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 20, మోడల్ స్కూల్‌లో 30, రుద్రవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10, మోడల్ స్కూల్‌లో 16, ఆళ్లగడ్డ బాలుర సాంఘిక సంక్షేమ పాఠశాలలో 30, బాలికల పాఠశాలలో 7, చాగలమర్రి ఉన్నత పాఠశాలలో 8, దొర్నిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల 8, ఉయ్యాలవాడ మోడల్ స్కూల్‌లో 30 సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. కాగా జిల్లాలో ఇంత వరకు 10 పాఠశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు జరిగాయి. త్వరలో కస్తూర్బా పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎంఈఓ నాగార్జునరెడ్డి తెలిపారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులుదీరారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
చెక్ డ్యాం కబ్జా
పగిడ్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని మండలంలో టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పడమర ప్రాతకోట గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ఆ గ్రామ టీడీపీ నాయకుడు యత్నించగా స్థానికులు అడ్డుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మరువక ముందే పగిడ్యాలలో చెక్ డ్యాం కబ్జా ఉదంతం వెలుగులోకి వచ్చింది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాలు అభివృద్ధి చేయాలని నల్లవాగు కాలువపై రూ. లక్షలతో గతంలో చెక్ డ్యాం నిర్మించారు. అయితే రెండు రోజుల క్రితం చెక్ డ్యాం పక్కనే పొలం ఉన్న టీడీపీ నాయకుడు చెక్ డ్యాం ఆనవాలు లేకుండా ధ్వంసం చేసి ఆ స్థలాన్ని పొలంలోకి కలుపుకోవడానికి యత్నించాడు. విషయం తెలిసిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఖాజాబాబు అడ్డుకున్నాడు. టీడీపీ నాయకుడి నిర్వాకంపై జిల్లా కలెక్టర్, పోలీసుల ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు.
చెంచు గూడేల్లో దోమల నివారణ చర్యలు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని చెంచు గిరిజన గూడేల్లో దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో మలేరియా అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచులు మలేరియా, డెంగీ, చికున్‌గున్యా జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి ఏసీఎం 5 శాతం పిచికారీ చేయాలన్నారు. కొత్తపల్లి, మద్దూరు, శ్రీశైలం, సున్నిపెంట, కపిలేశ్వరం, నాగులూటి గూడేల్లో దోమల నివారణపై చెంచులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎంఓలు సత్యనారాయణ, విజమ్‌కుమార్, సబ్ సెంటర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


