మే..మే.. తినేశాం! | - | Sakshi
Sakshi News home page

మే..మే.. తినేశాం!

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

మేకను అపహరించి ఆరగించిన టీడీపీ నాయకులు

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన

పంచాయితీ

‘అధికారంలోకి వచ్చాక ఎక్కువగా తిని పొట్ట ముందుకు వచ్చింది.. ఉక్కకు తట్టుకోలేకపోతున్నాం.. కాసింతైనా వాన పడింటే బాగుండు’ అనుకుంటున్న టీడీపీ నేతలను చల్లబరుస్తూ మేఘం వర్షించింది. అంతా బాగానే ఉన్నా వానలో ఒక ముక్క అయినా నమిలితే బాగుంటుందని కొందరు టీడీపీ నాయకులు మేకను కొట్టేశారు. ఎవరికీ తెలియకుండా దాన్ని కై మా చేసి ఆరగించారు. మేక ఊరుకుంటుందా? వారి పొట్టలోకి వెళ్లినా ‘మే..మే..’ అని అరిచింది.. విషయం అందరికీ తెలిసింది. పంచాయితీ పోలీస్‌ స్టేషన్‌కు వరకు వెళ్లింది. ఇసుక, నల్లమట్టి, ఎర్రమట్టిని దోచుకుంటున్న టీడీపీ నేతలు తామేం గొప్పవారు కాదని, మేకను తిన్నవారే సంపద సృష్టించే అసలైన పార్టీ నాయకులని కీర్తిస్తూ గీతాలు పాడుతున్నారు. ఇది కథ కాదు.. గోనెగండ్లలో జరిగిన వాస్తవం. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే..

గోనెగండ్లలో ఒక మేక పొలం నుంచి దారితప్పి దగ్గరలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి చేరింది. దీన్ని గమనించి ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌, టీడీపీ నాయకుడు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు, మరో ముగ్గురు కలిసి మేక తీసుకెళ్లారు. కోసుకొని కుప్పలుగా వేసి, పంపకాలు చేసుకుని, ఎవరికీ తెలియకుండా ఆరగించారు. ఈ విషయం మేక యాజమానికి తెలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచారణ చేసి మేక మాంసాన్ని ఆరగించిన టీడీపీ నాయకులను విచారణకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న సీపీఐకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు ‘మీరిద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు రచ్చకెక్కితే బాగోదు’ అంటూ సర్దిచెప్పారు. మేకను ఖరీదు చేసి పరిహారాన్ని బాధితుడికి ఇప్పించే విధంగా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ విషయం తెలిసి గోనెగండ్ల మండల ప్రజలు టీడీపీ నాయకులు ఇలాగా కూడా ఉంటారా అని నవ్వుకున్నారు. – గోనెగండ్ల

Advertisement
 
Advertisement
Advertisement