రుద్రవరం: నిబంధనల పేరుతో అధికారులు ఉపాధి కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉదయం పని ప్రదేశానికి వెళ్లగానే ఓ ఫొటో, పని ముగిశాక రెండో ఫొటో దిగాల్సి రావడం తప్పనిసరి చేయడంతో కూలీలు గంటల తరబడి పనుల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. ఉదయం ఫొటో వరకు బాగున్నప్పటికీ రెండో ఫొటోతోనే సమస్య తీవ్రమవుతోంది. ఒకసారి ఫొటో దిగితే రెండో ఫొటో తీసుకునేందుకు తప్పనిసరిగా నాలుగు గంటల వ్యవధి పడుతోంది. అంతే కాక ఒక్కోసారి సర్వర్ పని చేయక మరింత సమయం పడుతోంది. ఇలా రెండో ఫొటో ఆలస్యం కావడంతో కూలీల అవస్థలు వర్ణణాతీతం. ఇప్పటికే పని ప్రదేశంలో నీడ సౌకర్యం లేక మండే ఎండలో కూలీలు అలసిపోతున్నారు. రెండో ఫొటో కోసం ఎండలో నిరీక్షించాల్సి రావడంతో కూలీలు మండిపడుతున్నారు. తిప్పారెడ్డి పల్లె వద్ద సోమవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన రెండో ఫోటో కోసం దాదాపు 80 మంది కూలీలు పడిగాపులు కాశారు. ఎండకు తాళలేక ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల నీడన కూర్చుండి పోయారు. ఫొటో సమస్యపై ఏపీఓ గౌరీబాయ్‌ని అడగ్గా సాఫ్ట్ వేర్ అప్‌డేట్ కాక పోవడం, సర్వర్ పని చేయక పోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు.


