అర్జీలను గడువులోగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను గడువులోగా పరిష్కరించాలి

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

జిల్లా కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందజేసిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను చివరి నిమిషం వరకు పెండింగ్‌లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 61,530 అర్జీలు స్వీకరించగా, అందులో 4,214 అర్జీలు పురోగతిలో ఉన్నాయన్నారు. ఇంకా పరిశీలించని 128 అర్జీలను వెంటనే ఓపెన్‌ చేసి పరిశీలించాలన్నారు. రీఓపెన్‌ అర్జీలు 197 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని వారం రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా అర్జీదారులతో సంబంధిత శాఖ అధికారులు ఫోన్‌ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించినప్పటికీ, విద్యుత్‌ శాఖ, పౌర సరఫరాల శాఖ, మున్సిపల్‌ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, సెర్ప్‌, టిడ్కో, దేవాదాయ శాఖ, అటవీ శాఖ, రిజిస్ట్రేషన్‌ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ తదితర శాఖలు ఇప్పటి వరకు నివేదికలు సమర్పించలేదన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్స్‌ ద్వారా మొత్తం 153 దరఖాస్తులు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, డీఆర్వో రాము నాయక్‌, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి ఉమామహేశ్వరి, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement