కర్నూలు: పిల్లల భద్రత సమాజ బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు కోర్టు కాంపౌండ్‌లోని న్యాయ సేవా సదన్‌లో అంతర్జాతీయ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా సంబంధిత అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. లీలా వెంకటశేషాద్రితో పాటు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, సీ్త్ర, శిశు సంక్షేమ మహిళాభివృద్ధి ఆఫీసర్ విజయ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ప్రతి సంవత్సరం వేలాదిమంది పిల్లలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పిల్లలు ఇంటి నుంచి తప్పిపోతుండగా మరికొందరు కిడ్నాప్, అక్రమ రవాణా, ఆన్‌లైన్ మోసాలు, కుటుంబ సమస్యల కారణంగా అదృశ్యమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తప్పిపోయిన పిల్లల కోసం న్యాయసేవలు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాయని.. పోలీసులు, పీఎల్‌వీలు అందుబాటులో ఉంటారన్నారు. ఉమ్మడి జిల్లాల మిస్సింగ్ చిల్డ్రన్స్ సమాచారాన్ని సేకరించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.


