● తెలుగు తమ్ముళ్ల మట్టి దందా
● దర్జాగా అక్రమ తవ్వకాలు
● చోద్యం చూస్తున్న అధికారులు
ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్న దృశ్యం
రాయపాడులో కుందూ కట్టపై ఉన్న ఇసుకను తరలించిన దృశ్యం
నంద్యాల(అర్బన్): వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరందించే చెరువులు ఉనికిని కోల్పోతున్నాయి. చెరువుల మట్టి తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపిస్తోంది. మండలంలోని కానాల నాగమ్మ చెరువులో సాగునీటి సంఘానికి సంబంధించిన ఓ నాయకుడు గత వారం రోజులుగా మట్టిని తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల చిన్న చెరువులో బిల్లలాపురం గ్రామానికి చెందిన స్థానిక టీడీపీ నాయకులు మట్టిని అమ్ముతూ లక్షలు గడిస్తున్నారు. రోజుకు 50 ట్రాక్టర్లతో ప్రొక్లెయీన్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని తోడేస్తూ వెంచర్లు, పొలాలకు తరలిస్తున్నారు. వెంచర్లకు ఒక రేటు, పొలాలకు మరో ధర నిర్ణయించి రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మరికొంత మంది అధికారులు మాముళ్ల మత్తులో అక్కడేమి జరగలేదంటూ నివేదికలు పంపుతున్నారు. బహిరంగంగా మట్టి దందా జరుగుతూ ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతున్నా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. వారం రోజులుగా చెరువుల్లో మట్టి తోడేస్తుండటంతో జిల్లా స్థాయి అధికారులు కేసీ కెనాల్, రెవెన్యూ, పోలీసు అధికారులను పురామాయించగా కొద్ది సేపు మాత్రమే మట్టి తరలించే వాహనాలను నిలిపేశారు. వారు వెళ్లగానే రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లను మళ్లీ చెరువుల్లో దించి మట్టి దందా కొనసాగిస్తున్నారు. అధికారులు ఇచ్చిన అనుమతులు కొంత అయితే బావులను తవ్వినట్లుగా మట్టిని తోడేస్తున్నారు. ఓ వైపు ప్రజాప్రతినిధులు, మరో వైపు అధికారులు అండదండలతో తమ మట్టి దందాకు తిరుగులేదని తెలుగు తమ్ముళ్లు చెబుతుండటం విశేషం.
దూరాన్ని బట్టి వసూళ్లు..
దూరాన్ని బట్టి చెరువు మట్టికి ఖరీదు కడుతూ మాఫియా దందా సాగిస్తోంది. ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టి దగ్గర ప్రాంతానికి రూ.800, దూరమైతే రూ.1000 నుంచి రూ.1,200తో అమ్మకాలు జరుగుతున్నాయి. కానాల నాగమ్మ చెరువులోనే దాదాపు 50 నుంచి 60 ట్రాక్టర్లతో ఉదయం 5 గంటల నుంచే మట్టి దందా సాగుతుండటంతో రోజుకు 700 నుంచి 800 ట్రిప్పుల మట్టిని చెరువు నుంచి తోడేస్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఒక్క నాగమ్మ చెరువు నుంచే రూ.5 లక్షల నుంచి రూ.6లక్షల వరకు తమ్ముళ్లు ఆదాయం పొందుతున్నారు.
మంత్రి తనయుడు పేరు చెప్పి దందా..
స్థానిక మంత్రి ఫరూక్ తనయుడు ఫిరోజ్ పేరు చెబుతూ తెలుగు తమ్ముళ్లు మట్టి దందా సాగిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఏమీ చేయలేరంటూ తమకు మంత్రి నుంచి పూర్తి సహకారం ఉందని తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా చెరువుల్లో మట్టి యథేచ్ఛగా తోడేస్తున్నా సంబంధిత ప్రజాప్రతినిధి దీనిపై స్పందించకపోవడం తెలుగు తమ్ముళ్లు చెబుతున్న దాంట్లో నిజముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై మట్టి దందాతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎవరైనా అక్రమ తవ్వకాలకు పాల్పడితే తాను బాధ్యున్ని కాదంటూ మంత్రి తనయుడు ఫిరోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు హల్‌చల్ చేస్తోంది. గోస్పాడు మండలం రాయపాడు గ్రామంలో యథేచ్చగా కుందూ ఇసుకను తరలిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కుందూ విస్తరణ చేశారు. ఈ క్రమంలో కుందూ ఇసుకను తీసి కట్టపై భారీగా వేశారు. ఈ ఇసుకను కొందరు టీడీపీ నాయకులు మంత్రి తనయుడితో మాట్లాడుకొని అక్రమంగా తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


