● నేలకొరిగిన చెట్లు, విరిగిపడిన
కరెంట్ స్తంభాలు
● పలు చోట్ల నిలిచిపోయి విద్యుత్ సరఫరా
● దెబ్బతిన్న మామిడి, వివిధ పండ్ల తోటలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో శనివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ పట్టణాల్లో హోర్డింగ్‌లు, పెద్ద పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కర్నూలు నగరంలోని 20 వార్డులు, జిల్లాలో 50 గ్రామాల్లో అంధకారం నెలకొంది. మామిడి తోటల్లో కాయలు రాలి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కర్నూలు నగరంలోని రాజ్‌విహార్, ఆర్‌ఎస్‌రోడ్డు, కలెక్టరేట్, సీక్యాంపుల్లో పలు చోట్ల పాతబడిన కరెంట్ స్తంభాలు విరిగిపోయి. వృక్షాలు నేలమట్టం కావడతో ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంది. ముఖ్యంగా కలెక్టరేట్‌లోని పలు చెట్లు విరిగి పడ్డాయి. దీంతో మునిసిపల్ అధికారులు వాటి ని తీసివేసేందుకు చర్యలు తీసుకున్నారు. చాలా చోట్లా విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, వైర్లు గాలికి కోట్టుకుపోవడంతో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. దాదాపు 20 వార్డుల్లో శనివారం రాత్రంతా అంధకారం నెలకొంది. విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ఆదివారం సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు.
మామిడి రైతులకు తీవ్ర నష్టం
గాలివాన బీభత్సం సృష్టించడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు కాపు దశలో ఉండడంతో ఒక్కసారిగా రాలిపోయాయి. పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, చిప్పగిరి, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో దాదాపు 150 ఎకరాల్లో ఉన్న తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
కర్నూలులో ఒకరు మృతి
గాలివాన బీభత్సానికి కర్నూలులో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. కల్లూరు మండలం పందిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణ శనివారం సాయంత్రం కర్నూ లు నగరంలోని బీఆర్ రెడ్డి కాలనీ వెనుకవైపు ప్రయాణికులను దింపడానికి వెళ్లారు. అయితే ఆకస్మికంగా గాలివాన రావడంతో ఆటోపై విద్యుత్ స్తంభం విరిగిపడింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకులు టి.రాముడు. వై.నగేష్ డిమాండ్ చేశారు.
విద్యుత్ శాఖకు రూ.1.20 కోట్ల నష్టం
కర్నూలు (టౌన్): గాలివాన బీభత్సంతో విద్యుత్ శాఖకు రూ.1.25 కోట్లు నష్టం వాటిల్లింది. జిల్లాలో 475 విద్యుత్ స్తంభాలు, 60 కిలో మీటర్ల మేర విద్యుత్ లైన్లు, 17 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 139 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నా ఆదివారం సాయంత్రానికి పూర్తి కాలేదు. దీంతో కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాలు, అనేక గ్రామాలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది.
పిడుగుపడి వ్యక్తి మృతి
నందికొట్కూరు: పగిడ్యాల మండలం సంకిరేణిపల్లె గ్రామ పొలిమేరలో శనివారం రాత్రి గొర్రెలు మేపుతుండగా నందికొట్కూరు పట్టణం వడ్డేపేటకు చెందిన కందాల రాముడు(60) పిడుగు పడి మృతి చెందాడు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి కుమారులు రామకృష్ణ, రాజు కన్నీటి పర్యంతమయ్యారు.


