వామ్మో.. థై‘రాయి’డ్‌! | - | Sakshi
Sakshi News home page

వామ్మో.. థై‘రాయి’డ్‌!

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

జిల్లాలో పెరుగుతున్న వ్యాధి కేసులు

పిల్లలు, పెద్దలు అందరూ బాధితులే!

అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు

కర్నూలు(హాస్పిటల్‌): థైరాయిడ్‌ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. పాతికేళ్ల క్రితం వందలో ఒకరిద్దరిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ప్రతి పది మందిలో ఒకరికి ఉంటోంది. గతంలో మహిళల్లోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు మగవారిలోనూ సాధారణంగా కనిపిస్తోంది. పిల్లలు, పెద్దలు, సీ్త్రలు, పురుషులు అన్న తేడా లేకుండా అందరినీ వేధిస్తోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ చికిత్స నిర్వహిస్తారు. ప్రతి నెలా 700 నుంచి 800 మంది థైరాయిడ్‌ సమస్యతో చికిత్స కోసం ఈ విభాగానికి వస్తారు. వీరిలో 500 నుంచి 600 మందికి హైపోథైరాయిడిజం, 200 మందికి హైపర్‌ థైరాయిడిజం ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక్కడే గాక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులైన జనరల్‌ ఫిజీషియన్‌, ఎండోక్రైనాలజిస్టుల వద్దకు సైతం ప్రతిరోజూ 200 మంది దాకా ఈ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు అంచనా.

జాగ్రత్తలు తప్పనిసరి

థైరాయిడ్‌ వ్యాధి ఉన్న వారికి మెడ కింద భాగంలో వాపు కనిపిస్తుంది. ఆందోళన/నిరాశతో సహా మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి. వేడి/చలితో ఇబ్బంది, పొడి చర్మం, పెళుసుగా ఉండే గోళ్లు, ముఖం ఉబ్బడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి బాధితులకు కీళ్లనొప్పులతో పాటు ఊబకాయం వస్తుంది. అనారోగ్య సమస్యలతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. థైరాయిడ్‌ లక్షణాలు ఉంటే వైద్యులను కలిసి చికిత్స తీసుకుని నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో అయోడిన్‌ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్‌ హార్మోన్‌ల జీవక్రియను ఉత్తమంగా చేయడానికి, నట్స్‌, చిక్కుళ్లు, తృణదాన్యాలు వంటి సెలీనియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. దీర్ఘకాలిక ఒత్తిడి ఉంటే దానిని నియంత్రించుకోవడంతోపాటు తరచూ వ్యాయామం చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement