● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
నంద్యాల: ఎన్నికల సంఘం నిర్వహించే సర్ కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. ఆదివారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇసాక్‌బాషా మాట్లాడుతూ.. జూలై నెల నుంచి ఏపీలో సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాను పటిష్టం చేయడానికి, తప్పులను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ప్రజలు తమ ఓటు భద్రతపై ఏ మాత్రం అశ్రద్ధ చూపకుండా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు నిర్ణయించే ఓటును కాపాడుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సర్ సర్వేలో లక్షలాది మంది ఓట్లు గల్లంతైనట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయన్నారు. ఓటర్ల సవరణ ప్రక్రియలో పాల్గొనకపోతే ఓటు హక్కును తొలగించే అవకాశం ఉందన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో ఉండేలా, నకిలీ ఓట్లు వేరు చేసేలా చూసే బాధ్యత అందరిదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తమ ఓటు హక్కు భద్రంగా ఉందో లేదో సరి చూసుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తును ప్రశ్నించే హక్కును కోల్పోతామన్నారు. రాజకీయాలకు అతీతంతా ప్రతి ఒక్కరు సర్ కార్యక్రమంలో పాల్గొని ఓట్లు గల్లంతు కాకుండా, దొంగ ఓట్లు లేకుండా చూసుకోవాలన్నారు.


