నల్లమలలో గుక్కెడు నీరు కరువు | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో గుక్కెడు నీరు కరువు

May 25 2026 9:33 AM | Updated on May 25 2026 9:33 AM

ఖాళీగా సాసర్‌ పిట్లు

వన్యప్రాణులు విలవిల

రుద్రవరం: నల్లమల అడవిలోని వాగులు, వంకల్లో నీటి జాడలేదు. అరకొరగా ఉన్న నీరు కాస్త ఎండ తీవ్రతకు ఆవిరి అయ్యింది. అడవి దాటి బయటకు వద్దామనుకుంటే వంతెనల వద్ద ఇనుప గేటు వేశారు. వాటిని దాటుకుని అడవికి సమాంతరంగా ఉన్న తెలుగుగంగ ప్రధాన కాల్వ వద్దకు వెళ్దామంటే అక్కడ చుక్కనీరు లేక ఎండింది. వేసవిలో అడవి జంతువుల దాహం తీర్చేందుకు అధికారులు పలు చోట్ల సాసర్‌ పిట్లను నిర్మించి, వాటిలోను నీరు నింపలేదు. దీంతో దాహం తీరక మూగజీవాలు పడుతున్న వేదన అరణ్య రోదనగా మారింది.

దారులను మూసివేస్తూ ఇనుప గేట్లు

రుద్రవరం, చెలిమ రెండు రేంజ్‌ల పరిధిలో అటవీ ప్రాంతం దట్టంగా ఉంది. వర్షాకాలం అయితే అడవంతా పచ్చదనం అలుముకొని ఉంటుంది. వేసవి కాలంలో చెట్ల ఆకులన్నీ రాలి మోడుబారడంతో పాటు వాగులు, సెలేర్లలో నీరు ఆవిరి అయ్యి ఎండి పోతాయి. అప్పటి నుంచి అడవి జంతువులకు సమస్యలు మొదలవుతున్నాయి. గతంలో మూగజీవాలు రాత్రి సమయాల్లో అడవిలో నుంచి బయట పొలాల వద్దకు వచ్చి ఆకలి, దప్పులు తీర్చుకొని తిరిగి అడవిలోకి వెళ్లేవి. అలా వచ్చి వెళ్లే సమయంలో వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతుండేవి. అలా జరక్కుండా ఉండేందుకు అటవీ అధికారులు సాసర్‌ పిట్లను నిర్మించారు. వేసవి రాగానే ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకెళ్లి ఆ సాసర్‌ పిట్లలో నింపేవారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నా అధికారులు సాసర్‌ పిట్లను నీటితో నింపలేదు. అంతేకాకుండా వన్యప్రాణులు అడవిలో నుంచి బయటకు రాకుండా అక్కడక్కడ ఉన్న దారులను మూసి వేస్తూ ఇనుప గేట్లు అమర్చారు. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీరు లేక, అడవి దాటి బయటకు రాలేక మూగజీవాల పరిస్థితి అరణ్య రోదనగా మారింది. ఇప్పటికై నా అటవీ అధికారులు సాసర్‌ పిట్లలో నీరు నింపి మూగజీవాల గొంతులు తడిపేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఇదీ దుస్థితి..

రుద్రవరం గుమ్మకొండ ఉసేనయ్య స్వామి దారిలో రెండు సాసర్‌ పిట్లను నీటితో నింపలేదు.

చెలిమ రేంజ్‌ పెద్దకంబలూరు బీట్‌లో రెండు సాసర్‌ పిట్లలో నీరు లేదు.

ఉసేనయ్యస్వామి, పెద్దకంబలూరు వద్ద ఉన్న మూడు వంతెనలపై అడవి జంతువులు బయటకు రాకుండా ఇనుప గేట్లను అమర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement