కోసిగి: దాదాపు 45 రోజుల క్రితం ‘ఊరికి రోడేస్తున్నాం’. అంటూ కూటమి నేతలు హడావుడి చేశారు. ఆర్భాటంగా పూజలు చేసి రోడ్డు పనులకు టెంకాయ కొట్టారు. త్వరలో పనులు పూర్తయి రోడ్డు సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు సంతోషపడ్డారు. అయితే నెలన్నర రోజులు గడుస్తున్నా పనులు అడుగు కూడా కదలలేదు. తుంబిగనూరు గ్రామ శివారు నుంచి సాతనూరు, అగసనూరు గ్రామాల మీదుగా కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటర్లు సీసీ, బీటీ రోడ్డు పనులు చేసేందుకు రూ.5.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తుంబిగనూరు గ్రామ మధ్యలో 25/6 కిలో మీటరు నుంచి కందుకూరు శివారు 33/4 కిలో మీటరు వరకు ఆర్‌అండ్‌బీ కింద నిధులు కేటాయించారు. ఇందులో అగసనూరు, సాతనూరు గ్రామాల్లో 900 మీటర్లు సీసీ రోడ్డుకు రూ.2.5 కోట్లు, మిగిలిన 8.1 కిలో మీటర్లు బీటీ రోడ్డుకు రూ.3 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఆయా గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి గుంతలు గుంతల మయంగా తయారైంది. ఏళ్ల తరుబడి రోడ్డు వసతి లేక ప్రయాణికులు , వాహనదారులు రోడ్డు పై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కూటమి నాయకులు భూమి పూజ చేయడంతో రోడ్డు ఏర్పాటు చేస్తారని సంతోషపడ్డారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాకపోవడంతో రోడ్డు వేస్తారా లేదా కేవలం ఆర్భాటమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్‌అండ్‌బీ ఏఈ నరేష్‌ను వివరణ కోరగా.. తుంబిగనూరు – కందుకూరు గ్రామ శివారు వరకు 9 కిలోమీటరుల రోడ్డు వేసేందుకు నిధులు మంజూరయ్యాయని, రోడ్డు అడుగు భాగాన వేసేందుకు గ్రావెల్ లభించడం లేదన్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కొరత ఉందని, తవ్వకాలకు మైనింగ్ అనుమతి కావాల్సి ఉందని చెప్పారు.
21 మందికి కారుణ్య నియామకాలు
కర్నూలు(సెంట్రల్): కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చెప్పారు. వీరందరినీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఎంపికై న వారికి నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. జేసీ నూరుల్ ఖమర్, ఇన్‌చార్జ్ డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, సెక్షన్ సిబ్బంది సన పాల్గొన్నారు.


