పాములపాడు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో పేదలకు అందాల్సిన మందులు, సూదులు బూడిదపాలయ్యాయి. మద్దూరు గ్రామంలోని సచివాలయంలో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రం సిబ్బంది సోమవారం గుట్టుగా విలువైన మందులకు నిప్పుపెట్టి తగులబెట్టారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం వేల రూపాయల ప్రజా ధనం బూడిదపాలైంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు స్టాక్ లేవు.. బయటకొనుక్కోండి.. అని సలహాలు ఇచ్చే సిబ్బంది విలువైన మందులను ఆసుపత్రి వెనుక కుప్పగా పోసి తగలబెట్టారు. ఆ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఉన్నాయి. గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాల్సి ఉండగా, తమ తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్టాక్ ఉన్నప్పుడే రోగులకు ఎందుకు పంపిణీ చేయలేదు? అవి గడువు ముగిసే వరకు ఎందుకు నిల్వ చేశారు? అనే ప్రశ్నలకు సిబ్బంది వద్ద సమాధానం లేదు. ఈ ఘటనపై వైద్యాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


