మాజీ సైనికుడి భార్య ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుడి భార్య ఆత్మహత్య

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

ఆదోని అర్బన్‌: పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన మాజీ సైనికుడు వీరేష్‌ భార్య శైలజ(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని టూటౌన్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

అప్పుల బాధతో యువకుడు..

కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దుద్యాల గ్రామంలోని రాజమూరి నాగశేషులు, నాగలక్ష్మీల దంపతులకు కుమారుడు పుల్లయ్య అలియాస్‌ ప్రవీణ్‌(23)తో పాటు మరో ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటర్‌ చదివిన పుల్లయ్య చదువు మానేసి ఐదేళ్లుగా ఆత్మకూరు పట్టణంలోని బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు జీతం సరిపోగా స్నేహితుల వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జయశేఖర్‌ తెలిపారు.

అనారోగ్యంతో వృద్ధురాలు..

మహానంది: గోపవరం గ్రామానికి చెందిన పిన్నాపురం నాగలక్ష్మమ్మ (68) గూడ్సు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగలక్ష్మమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఆదివారం గ్రామ సమీపంలో రైల్వే గేటు వద్ద గూడ్సు రైలు కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న నంద్యాల రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కోడలు లక్ష్మిదేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement