మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 35.05 లక్షలు
మహానంది: హుండీ కానుకల ద్వారా శ్రీ మహానందీశ్వరస్వామికి రూ. 35.05 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో హుండీ కానుకలను గురువారం లెక్కించినట్లు చెప్పారు. ఆలయాల ద్వారా రూ. 34,64,108 , గో సంరక్షణ ద్వారా రూ.16,825 , అన్నప్రసాదం ద్వారా రూ. 24,640 మొత్తంగా రూ. 35,05,573 లభించిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి మోహన్, ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మార్చి నెల పింఛన్ల పంపిణీ
నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీ ఈ నెల 28న చేపట్టడానికి డీఆర్‌డీఏ ఏర్పాట్లు చేసింది. పంపిణీకి అవసరమైన నిధులు శుక్రవారం బ్యాంకులకు విడుదలయ్యాయి. వెంటనే వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. మార్చి 1న ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 2,36,185 పింఛన్లకు రూ.103.87కోట్లు, నంద్యాల జిల్లాలో 2,12,494 పింఛన్లకు రూ.92.03 కోట్లు పంపిణీ చేయనున్నారు. మిగిలిపోయిన వారికి మార్చి 2న పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
వైభవంగా తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, పండితులు, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. తిరుచ్చి మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
బంగారు రుద్రాక్షమాల, హారం విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బాపట్లకు చెందిన కూరపాటి మాధవి, కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు జి.రవికుమార్, ఇన్‌స్పెక్టర్ కె.మల్లికార్జునకు అందజేశారు. బంగారు హారాన్ని విరాళంగా అందించిన దాతకు రసీదుతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. దాతలు మాట్లాడుతూ.. 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం తయారు చేయించినట్లు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు చెప్పారు.
మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 35.05 లక్షలు
మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 35.05 లక్షలు


