మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంపై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఎకై ్సజ్, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీ వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి అక్రమ మద్యం తయారీని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతోందన్నారు.సమావేశంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఎకై ్సజ్, పోలీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈఓ, ఐసీడీఎస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


