తప్పొకరిది.. శిక్షొకరికి! | - | Sakshi
Sakshi News home page

తప్పొకరిది.. శిక్షొకరికి!

Feb 14 2026 9:29 AM | Updated on Feb 14 2026 9:29 AM

తప్పొకరిది.. శిక్షొకరికి!

తప్పొకరిది.. శిక్షొకరికి!

ఎఫ్‌డీపీటీ విజయకుమార్‌ బదిలీ

ఆత్మకూరు రూరల్‌: నాగార్జునసాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యం(ఎన్‌ఎస్‌టీఆర్‌ ప్రాజెక్ట్‌ టైగర్‌) ఫీల్డ్‌ డైరెక్టర్‌ బి.విజయకుమార్‌ను ఉన్నఫళంగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పట్టుమని ఐదు నెలలు గడవక మునుపే శుక్రవారం ఆయనను బదిలీ చేస్తూ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే అటవీదళాల ప్రధాన అధికారి పీసీసీఎఫ్‌ చలపతి ఎదుట రిపోర్ట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా సీఎఫ్‌ కాశీ విశ్వనాథరాజుకు ఎన్‌ఎస్‌టీఆర్‌ ఎఫ్‌డీపీటీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. అయితే శ్రీశైలంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను బలిపెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలంలో ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. జిల్లా అధికార యంత్రాంగంతో పాటు శ్రీశైలం ఆలయ ఈఓ, పాలకవర్గం మీనమేషాలు లెక్కించడంతోనే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు లాఠీచార్జికి దారి తీయడం భక్తుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అద్దం పట్టింది. తప్పులను సరిదిద్దుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం, తప్పంతా అటవీ శాఖపై నెట్టి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. ఎన్‌ఎస్‌టీఆర్‌ ఎఫ్‌డీపీటీ విజయకుమార్‌ బదిలీయే ఇందుకు నిదర్శనం. అటవీ మార్గంలో పాదయాత్రకు ఈనెల 8 నుంచి ఏడు రోజుల పాటు మాత్రమే అవకాశం కల్పించడం వల్లే శ్రీశైలంలో భక్తుల రద్దీకి కారణమైందనే కోణంలో ఆయనపై చర్యలు తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

పులుల అంచనా కేంద్రం నిర్ణయం

జాతీయ ప్రొటోకాల్‌లో భాగంగా గత డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది మే నెల వరకు పులుల అంచనా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత అటవీ శాఖపైనే ఉంటోంది. అప్పటికీ శివ భక్తుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకొని ఇక్కడి అధికారులు కొంత వెసులుబాటు కల్పించారు. ఫలితంగా రెండు రోజుల ముందు నుంచే వెంకటాపురం నుంచి భక్తుల పాదయాత్ర మొదలైంది. అయితే కేంద్రం పరిధిలోని నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ శాఖ అధికారిపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడం గమనార్హం.

శ్రీశైలం ఘటన నేపథ్యంలో

స్థానచలనం?

వాస్తవంలోకి వెళితే..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీని అంచనా వేయడంలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఇదే సమయంలో సామాన్య భక్తులు, శివస్వాములను కాదని ప్రోటోకాల్‌ దర్శనాలు, వీఐపీల సేవలోనే శ్రీశైలం ఈఓ, పాలక వర్గం తరించడం వల్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. క్యూలైన్లలో, ఎండలో గంటల తరబడి నిల్చోబెట్టిన ఫలితంగా శివస్వాముల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ విషయంలో ఆత్మ విమర్శను పక్కనపెట్టి తప్పంతా అటవీశాఖదే అన్నట్లుగా చర్యలకు ఉపక్రమించడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement